Tata Motors: సిరియాలోకి టాటా మోటార్స్ ఎంట్రీ.. వాణిజ్య వాహనాల విక్రయాలు ప్రారంభం!
Tata Motors: టాటా మోటార్స్ సిరియా మార్కెట్‌లోకి ప్రవేశించింది. GAMCO భాగస్వామ్యంతో పికప్‌ల నుంచి 60 టన్నుల భారీ ట్రక్కులు, బస్సులను అందుబాటులోకి తేనుంది.
Tata Motors: సిరియాలోకి టాటా మోటార్స్ ఎంట్రీ.. వాణిజ్య వాహనాల విక్రయాలు ప్రారంభం!
Tata Motors: ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సిరియా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. గ్రాండ్ ఆటో అండ్ మెషినరీ కో. (GAMCO) ద్వారా ఘస్సాన్ అబౌద్ ఆటోమోటివ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందంతో సిరియాలోని రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో తన వాణిజ్య వాహనాల విక్రయాలను ప్రారంభించనుంది.
పికప్‌ల నుంచి భారీ ట్రక్కుల వరకు అందుబాటులోకి!
ఈ భాగస్వామ్యం ద్వారా సిరియా మార్కెట్‌లో టాటా మోటార్స్ పూర్తి స్థాయి వాణిజ్య వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒక టన్ను కంటే తక్కువ సామర్థ్యం కలిగిన పికప్ వాహనాల నుంచి 60 టన్నుల భారీ ట్రక్కుల వరకు వివిధ రకాల కార్గో వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.
అంతేకాకుండా 9 నుంచి 71 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన బస్సులు, ఇతర ప్రజా రవాణా వాహనాలను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ వాహనాల విక్రయాలు, నిర్వహణ, మరమ్మతుల కోసం GAMCO ఆధ్వర్యంలో సిరియా వ్యాప్తంగా అమ్మకాలు, సేవల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సిరియా మార్కెట్‌పై భారీ అంచనాలు
ఈ భాగస్వామ్యంపై టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ ఆసిఫ్ షమీమ్ మాట్లాడుతూ.. సిరియాలో తమ అధునాతన రవాణా పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఘస్సాన్ అబౌద్ ఆటోమోటివ్, GAMCO సంస్థలకు ఈ రంగంలో మంచి అనుభవం, ప్రాంతీయంగా బలమైన వ్యాపార నెట్‌వర్క్ ఉన్నాయని పేర్కొన్నారు.
సిరియాలో సరుకు రవాణాకు రోడ్డు రవాణా కీలకమని, ఈ నేపథ్యంలో తమ వాణిజ్య వాహనాలకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిక ఉత్పాదకత, మెరుగైన పనితీరు, తక్కువ నిర్వహణ వ్యయంతో కూడిన వాహనాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
దీర్ఘకాలిక భాగస్వామ్యమే లక్ష్యం
ఘస్సాన్ అబౌద్ హోల్డింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీఈఓ సౌద్ అబ్బాసి మాట్లాడుతూ.. తమ సంస్థ వాహనాల పోర్ట్‌ఫోలియోలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాటా మోటార్స్ బ్రాండ్‌ను చేర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సిరియా మార్కెట్ అవసరాలకు టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలు అనుగుణంగా ఉంటాయని, వివిధ పరిశ్రమలకు నమ్మకమైన రవాణా పరిష్కారాలను అందించగలవని పేర్కొన్నారు. వినియోగదారులు, వ్యాపార భాగస్వాములతో పాటు సిరియా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
50కి పైగా దేశాల్లో టాటా మోటార్స్ కార్యకలాపాలు
టాటా మోటార్స్ అంతర్జాతీయ విస్తరణ వ్యూహంలో భాగంగానే సిరియాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికా, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (CIS) తదితర ప్రాంతాల్లో 50కి పైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తాజాగా సిరియా మార్కెట్‌లోకి ప్రవేశించడంతో అంతర్జాతీయ వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఏర్పడింది.




