Tech Layoffs: ఈ-కామర్స్ దిగ్గజంలో లేఆఫ్స్ ప్రకంపనలు.. 1,000 మందికి పైగా సిబ్బందిపై వేటు
Tech Layoffs: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఈబే 9 శాతం సిబ్బందిని తొలగిస్తూ 1,000 మందికి లేఆఫ్స్ ప్రకటించింది.
eBay Layoffs
Tech Layoffs: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈబే తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో దాదాపు 9 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. కంపెనీ ఆపరేషన్స్ సరళీకృతం చేయడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న కేటగిరీల వైపు వనరులను మళ్లించేందుకు ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ జామీ ఇయాన్నోన్ స్పష్టం చేశారు. గతంలో కూడా సంస్థ పలు దఫాలుగా లేఆఫ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
వ్యాపార వ్యూహాల్లో మార్పులు
పోటీదారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ఈబే తన బిజినెస్ మోడల్‌ను రీ-రూట్ చేస్తోంది. ప్రధానంగా అథెంటికేటెడ్ లగ్జరీ వస్తువులు, అరుదైన కలెక్టిబుల్స్, రీఫర్బిష్డ్ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెడుతోంది. ఫ్యాషన్ రీసేల్ ప్లాట్‌ఫామ్ డిపాప్ ఒప్పందం ద్వారా యువ వినియోగదారుల్లో తన పట్టును సాధించింది. వ్యయ నియంత్రణ, లాభదాయకమైన విభాగాలపై దృష్టి పెట్టడం వల్ల ఈబే షేర్లు విపణిలో పుంజుకున్నాయి. విపణిలో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ సంస్థ లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం.
నెట్‌ఫ్లిక్స్‌లోనూ రీస్ట్రక్చరింగ్ భయం
కేవలం ఈ-కామర్స్ రంగానికే కాకుండా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు కూడా లేఆఫ్స్ సెగ తగిలింది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్ లోనూ సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 6 శాతానికి సమానం. సబ్స్క్రిప్షన్ల వృద్ధి ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం, నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సంస్థ ఈ కఠిన నిర్ణయం వైపు అడుగులు వేసింది. 2022లో వరుసగా ఉద్యోగులను తొలగించిన నెట్‌ఫ్లిక్స్, మళ్లీ ఇప్పుడు లేఆఫ్స్ బాట పట్టడంతో టెక్ ప్రపంచం ఆందోళన చెందుతోంది.
కార్పొరేట్ ఉద్యోగుల్లో పెరిగిన అభద్రతా భావం
గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా బడా టెక్, డిజిటల్ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై పిడుగు వేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగం పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం కూడా ఈ లేఆఫ్స్‌కు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలు సైతం భవిష్యత్తు అవసరాల పేరుతో సిబ్బందిని తగ్గించుకోవడం కార్పొరేట్ రంగంలో కలకలం రేపుతోంది. విడతల వారీగా జరుగుతున్న ఈ తొలగింపులతో ఉద్యోగులలో అభద్రతా భావం పెరిగిపోతోంది.




