Beedi Workers: 7 లక్షల మంది బీడీ కార్మికులకు ‘రేవంత్’ సర్కార్ గుడ్ న్యూస్.. పెరగనున్న వేతనాలు!
Beedi Workers: తెలంగాణ బీడీ కార్మికులకు వేతనాలు పెరుగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వెయ్యి బీడీలకు రూ. 275.23 వరకు చెల్లించనుండగా, ఈ ఒప్పందం 2028 వరకు అమలులో ఉంటుంది.
Beedi Workers: 7 లక్షల మంది బీడీ కార్మికులకు ‘రేవంత్’ సర్కార్ గుడ్ న్యూస్.. పెరగనున్న వేతనాలు!
Beedi Workers: తెలంగాణలోని బీడీ కార్మికుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో వేతనాల పెంపుపై ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఆర్థికంగా భారీ వెసులుబాటు కలగనుంది.
కొత్త వేతనాల వివరాలు:
హైదరాబాద్‌లో జరిగిన తాజా సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వేతనాలు ఈ విధంగా ఉండనున్నాయి.
1000 బీడీలకు పెంపు: ప్రస్తుతం వెయ్యి బీడీలు చుడితే ఇచ్చే రూ. 268.31 వేతనాన్ని రూ. 275.23కు పెంచారు (రూ. 6 మేర పెంపు).
అదనపు ప్రయోజనాలు: బోనస్‌లు, జాతీయ సెలవుల భత్యం కలుపుకుంటే వెయ్యి బీడీలపై మొత్తం రూ. 6.92 మేర పెరుగుదల ఉంటుంది.
గడువు: ఈ కొత్త వేతన ఒప్పందం 2028 ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుంది.
మహిళా కార్మికులకు పెద్దపీట
తెలంగాణలో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారిలో 98 శాతం మంది మహిళలే కావడం విశేషం. ప్రధానంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ వంటి జిల్లాల్లోని పేద కుటుంబాలకు ఈ పెంపు ఆసరాగా నిలవనుంది. ముఖ్యంగా బీడీ పరిశ్రమకు కేంద్రమైన నిజామాబాద్ జిల్లాలో అత్యధిక మంది దీనివల్ల లబ్ధి పొందుతారు.
కేవలం బీడీలు చుట్టే వారికే కాకుండా, పరిశ్రమలో పనిచేసే ఇతర సిబ్బందికి కూడా మేలు చేకూరింది.
ప్యాకర్లు: వీరికి నెలకు రూ. 4,500 వరకు జీతం పెరగనుంది.
ఇతర సిబ్బంది: బట్టీవాలాలు, మునిమ్‌లు, క్లర్క్‌లకు నెలకు రూ. 2,200 మేర వేతనం పెరగనుంది.
మొదట రూ. 3 పెంపు మాత్రమే ఉంటుందని భావించినప్పటికీ, కార్మిక సంఘాల పట్టుబట్టడంతో యాజమాన్యాలు రూ. 6 పెంపునకు అంగీకరించాయి. పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా ఈ పెంపు తమ కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




