తెలంగాణలో పెరిగిన సన్నబియ్యం ధరలు.. కిలో రూ.85 వరకు

తెలంగాణలో సన్నబియ్యం ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.65 నుంచి రూ.85 వరకు చేరాయి. ధరల పెరుగుదలకు కారణాలేంటో తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 3:50 AM IST
Telangana Rice Prices
X

Telangana Rice Prices

తెలంగాణలో సన్నబియ్యం ధరలు భారీగా పెరిగాయి. గత నాలుగు నెలలుగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం కిలో రూ.65 నుంచి రూ.85 వరకు చేరాయి. దీంతో బియ్యం కొనుగోలు చేయడం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.

నాలుగు నెలల క్రితం కిలో సన్నబియ్యం ధర రూ.50 నుంచి రూ.55 మధ్య ఉండగా.. ప్రస్తుతం అదే బియ్యం రకం రూ.65 నుంచి రూ.85 వరకు పలుకుతోంది. నాణ్యత తక్కువగా ఉన్న బియ్యం ధర కూడా కిలోకు రూ.60కి పైగానే ఉంది. దీంతో సన్నబియ్యం ధరలు దాదాపు 25 శాతం మేర పెరిగాయి.

బియ్యం ధరల పెరుగుదలతో నూకల ధరలు కూడా పెరిగాయి. గతంలో కిలో నూకలు సుమారు రూ.20కి లభించగా.. ప్రస్తుతం రూ.30 వరకు చేరాయి. దీంతో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై కూడా అదనపు భారం పడుతోంది.

తగ్గిన వరి సాగు.. పెరిగిన ధరలు

బియ్యం ధరల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఆశించిన స్థాయిలో ధాన్యం దిగుబడి రాకపోవడం, వరి సాగు విస్తీర్ణం తగ్గడం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

గత ఏడాది తెలంగాణలో సుమారు 92 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈసారి సాగు విస్తీర్ణం సుమారు 78 లక్షల ఎకరాలకు తగ్గే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో ధాన్యం సరఫరా తగ్గి రానున్న రోజుల్లో బియ్యం ధరలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

తెలంగాణలో పండే సన్న ధాన్యానికి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో సన్న రకం వరిని అధికంగా సాగు చేస్తున్నారు.

పంట కోతలు ప్రారంభం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు తెలంగాణకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పెద్ద మొత్తంలో ధాన్యం తరలిపోతోంది. దీంతో స్థానిక మార్కెట్లలో సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ముందస్తు నగదు చెల్లింపులతో వ్యాపారులపై భారం

రైస్ మిల్లర్లు, కిరాణా వ్యాపారుల మధ్య లావాదేవీల విధానంలో మార్పులు కూడా బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతంలో బియ్యం సరఫరా చేసిన తర్వాత కిరాణా వ్యాపారులకు సుమారు రెండు నెలల వరకు చెల్లింపు గడువు ఇచ్చేవారు.

ప్రస్తుతం మాత్రం ముందుగానే నగదు చెల్లిస్తేనే బియ్యం సరఫరా చేస్తామని మిల్లర్లు చెబుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో రిటైల్ వ్యాపారులపై పెట్టుబడి భారం పెరిగింది. ఈ అదనపు భారాన్ని భర్తీ చేసుకునేందుకు కొందరు వ్యాపారులు బియ్యం ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్