Apple CEO : ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ రాజీనామా.. 15 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు.. కొత్త బాస్ ఎవరంటే ?
Apple CEO : టెక్ ప్రపంచంలో ఒక శకం ముగియబోతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఆపిల్‌ను తీర్చిదిద్దిన టిమ్ కుక్, తన సీఈఓ పదవికి రాజీనామా చేయబోతున్నారు.
Tim Cook
Apple CEO : టెక్ ప్రపంచంలో ఒక శకం ముగియబోతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఆపిల్‌ను తీర్చిదిద్దిన టిమ్ కుక్, తన సీఈఓ పదవికి రాజీనామా చేయబోతున్నారు. సుమారు 15 ఏళ్ల పాటు కంపెనీ పగ్గాలను చేపట్టి, ఆపిల్‌ను కొత్త శిఖరాలకు చేర్చిన కుక్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ జాన్ టర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
2011లో స్టీవ్ జాబ్స్ అనారోగ్య కారణాలతో తప్పుకున్నప్పుడు, ఆపిల్ బాధ్యతలను టిమ్ కుక్ చేపట్టారు. నిజానికి 1998లోనే ఆయన ఆపిల్‌లో చేరారు. అప్పట్లో ఆపిల్ కంపెనీ దాదాపు దివాలా తీసే స్థితిలో ఉంది. కానీ కుక్ తన అద్భుతమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలతో కంపెనీని ఆ గండం నుంచి గట్టెక్కించారు. స్టీవ్ జాబ్స్ లాగా టెక్నాలజీలో గొప్ప ఆవిష్కర్త కాకపోయినా, జాబ్స్ ఐడియాలను మార్కెట్లోకి పక్కాగా తీసుకెళ్లడంలో కుక్ సక్సెస్ అయ్యారు. ఆయన హయాంలోనే ఆపిల్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా నిలిచింది.
టిమ్ కుక్ స్థానంలో రాబోతున్న జాన్ టర్నస్ ఆపిల్‌కు కొత్తేమీ కాదు. గత 25 ఏళ్లుగా ఆయన ఈ కంపెనీతో విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి ప్రధాన ఉత్పత్తుల డిజైన్, ఇంజనీరింగ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ నమ్మకస్తుడిగా పేరున్న టర్నస్, సెప్టెంబర్ 1 నుంచి అధికారికంగా సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు.
65 ఏళ్ల టిమ్ కుక్ సీఈఓ పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఆపిల్ కంపెనీతో ఆయన అనుబంధం కొనసాగుతుంది. ఆయన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాత్రను పోషిస్తారు. అంటే కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, కీలక నిర్ణయాల్లో ఆయన సలహాలు, సూచనలు కొనసాగుతూనే ఉంటాయి. ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చి కంపెనీ ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఘనత టిమ్ కుక్‌ది.
జాన్ టర్నస్ నేతృత్వంలో ఆపిల్ ఎలాంటి మార్పులకు లోనవుతుందనేది ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫోల్డబుల్ డివైజ్‌ల వైపు అడుగులు వేస్తోంది. టిమ్ కుక్ సెట్ చేసిన హై స్టాండర్డ్స్‌ను టర్నస్ ఎలా కొనసాగిస్తారో చూడాలి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆపిల్ నాయకత్వంలో జరుగుతున్న ఈ మార్పు, కంపెనీ షేర్ వాల్యూపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.




