Toll System: ఇకపై టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగవు.. మారనున్న టోల్ వసూలు విధానం
Toll System: హైవేలపై ప్రయాణించే వారికి టోల్ ప్లాజాల వద్ద ఎదురయ్యే పొడవాటి క్యూలు తరచూ ఇబ్బందిగా మారుతుంటాయి.
Toll System: ఇకపై టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగవు.. మారనున్న టోల్ వసూలు విధానం
Toll System: హైవేలపై ప్రయాణించే వారికి టోల్ ప్లాజాల వద్ద ఎదురయ్యే పొడవాటి క్యూలు తరచూ ఇబ్బందిగా మారుతుంటాయి. టోల్ చెల్లించేందుకు వాహనాన్ని ఆపడం వల్ల సమయం వృథా కావడంతో పాటు ఇంధనం కూడా ఖర్చవుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది.
2027 మార్చి నాటికి పూర్తిస్థాయిలో కొత్త విధానం
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా టోల్ వసూలు విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. 2026 డిసెంబర్ చివరి నాటికి 70 శాతానికి పైగా టోల్ బూత్‌లను బ్యారియర్-ఫ్రీగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 మార్చి నాటికి నేషనల్ హైవేలపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను బ్యారియర్-ఫ్రీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం దేశంలో 13 కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ అయ్యాయి. నేషనల్ హైవేలపై ఫాస్ట్‌ట్యాగ్ వినియోగం కూడా 98 శాతానికి మించి ఉంది. దీంతో కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయడానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు ఇప్పటికే చాలావరకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
వాహనం ఆపకుండానే టోల్ ఎలా కట్ అవుతుంది?
కొత్త విధానంలో మల్టీ-లేన్ ఫ్రీ-ఫ్లో (MLFF) టోలింగ్ సిస్టమ్ కీలకంగా మారనుంది. ఈ విధానంలో టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం ఉన్నట్లుగా వాహనాలు ఆపేందుకు బ్యారియర్లు ఉండవు. టోల్ జోన్‌లోకి వాహనం ప్రవేశించినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన హైటెక్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను ఆటోమేటిక్‌గా గుర్తిస్తాయి. ANPR టెక్నాలజీ ద్వారా నంబర్ ప్లేట్ వివరాలను నమోదు చేసి, వాహనానికి అనుసంధానమైన చెల్లింపు వ్యవస్థ ద్వారా టోల్ మొత్తాన్ని వసూలు చేస్తారు. దీంతో డ్రైవర్ టోల్ బూత్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ విధానాన్ని 2026 మే 11న ముంబైలోని ఒక టోల్ ప్లాజా వద్ద పరీక్షించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా
బ్యారియర్-ఫ్రీ టోల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనదారులకు ప్రధానంగా సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద ఒక్కో వాహనం సగటున 12 నిమిషాల వరకు ఆగాల్సి వస్తుందని గడ్కరీ తెలిపారు. కొత్త విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఈ నిరీక్షణ సమయం దాదాపు తొలగిపోనుంది. ఫలితంగా హైవేలపై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. వాహనాలు టోల్ వద్ద ఎక్కువసేపు నిలిచిపోకపోవడంతో ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లడం వల్ల దేశవ్యాప్తంగా ఏటా సుమారు రూ.5,250 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ గడ్కరీ వెల్లడించారు.
ప్రభుత్వానికి కూడా భారీగా పెరగనున్న ఆదాయం
కొత్త టెక్నాలజీతో వాహనదారులకే కాకుండా ప్రభుత్వానికి కూడా ప్రయోజనం కలగనుంది. ఫాస్ట్‌ట్యాగ్ వినియోగం పెరగడంతో ఇప్పటికే టోల్ వసూళ్లు 10 శాతం పెరిగాయని కేంద్ర మంత్రి తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.7,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో మొత్తం టోల్ ఆదాయం రూ.82,000 కోట్లకు మించి ఉందని వెల్లడించారు. బ్యారియర్-ఫ్రీ టోల్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏటా రూ.20,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు అదనపు ప్రయోజనం లభించే అవకాశం ఉందని గడ్కరీ తెలిపారు. మరోవైపు టోల్ బూత్‌ల నిర్వహణ ఖర్చు కూడా ప్రస్తుతం ఉన్న సుమారు 12 శాతం నుంచి 2-3 శాతానికి తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. కొత్త విధానం అమల్లోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద క్యూలు, వాహనాల నిరీక్షణ తగ్గడంతో పాటు ప్రయాణికులకు సమయం, ఇంధనం ఆదా కానుంది.




