Food delivery: ఇక‌పై డ్రోన్లు ఫుడ్ డెలివ‌రీ చేస్తాయి.. ఉబ‌ర్ ఈట్స్ ప్ర‌ణాళిక‌లు!

Food delivery: ఇప్పటివరకు మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం స్కూటీ, బైక్ లేదా సైకిల్‌పై డెలివరీ ఏజెంట్‌ ద్వారా ఇంటికి చేరేది.

Mokshith
Published on: 20 Aug 2026 12:12 PM IST
Food delivery
X

Food delivery: ఇక‌పై డ్రోన్లు ఫుడ్ డెలివ‌రీ చేస్తాయి.. ఉబ‌ర్ ఈట్స్ ప్ర‌ణాళిక‌లు!

Food delivery: ఇప్పటివరకు మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం స్కూటీ, బైక్ లేదా సైకిల్‌పై డెలివరీ ఏజెంట్‌ ద్వారా ఇంటికి చేరేది. కానీ భవిష్యత్తులో ఈ విధానం పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇకపై రోడ్లపై కాకుండా ఆకాశం నుంచి డ్రోన్లు ఆహారాన్ని నేరుగా ఇంటి వద్దకు తీసుకొచ్చే రోజులు రాబోతున్నాయి. అమెరికాలో ఈ కొత్త విధానానికి రంగం సిద్ధమవుతోంది.

చేతులు క‌లిపిన ఉబర్ ఈట్స్–జిప్‌లైన్‌

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్.. డ్రోన్ డెలివరీ కంపెనీ జిప్‌లైన్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలో వినియోగదారులకు డ్రోన్లతో ఆహారాన్ని డెలివరీ చేయాలని కంపెనీలు నిర్ణయించాయి. ముఖ్యంగా డెలివరీ ఏజెంట్ అవసరం లేకుండానే డ్రోన్ నేరుగా కస్టమర్‌కు ఆర్డర్‌ను చేరవేయనుంది.

జిప్‌లైన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని అమెరికా నగరాల్లో 2026 చివరి నాటికి ఈ డ్రోన్ డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని నగరాలకు ఈ సేవను విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఉబర్.. జిప్‌లైన్‌లో వ్యూహాత్మక పెట్టుబడి కూడా పెట్టింది. అయితే ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టిందనే విషయాన్ని కంపెనీలు వెల్లడించలేదు.

రోజుకు 10 లక్షల డెలివరీలే లక్ష్యం

ఇది కేవలం చిన్న స్థాయి ప్రయోగం కాదు. ఉబర్ ఈట్స్, జిప్‌లైన్ కలిసి చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. 2029 చివరి నాటికి రోజుకు 10 లక్షల డ్రోన్ డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జిప్‌లైన్ ఇప్పటికే నాలుగు ఖండాల్లో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 27 లక్షలకు పైగా డెలివరీలు చేసినట్లు కంపెనీ చెబుతోంది. వీటి ద్వారా 2 కోట్లకు పైగా వస్తువులను ప్రజలకు చేరవేసినట్లు వెల్లడించింది. తమ నెట్‌వర్క్‌లో సగటున ప్రతి 20 సెకన్లకు ఒక డెలివరీ జరుగుతుందని జిప్‌లైన్ పేర్కొంది.

మనుషులతో పాటు డ్రోన్ల సేవలు

ఉబర్ ఈట్స్‌ భవిష్యత్తులో పూర్తిగా మనుషుల డెలివరీ ఏజెంట్లను తొలగించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకురావడం లేదు. ప్రస్తుతం ఉన్న డెలివరీ వ్యవస్థకు డ్రోన్లు మరో భాగంగా ఉండనున్నాయి. అవసరాన్ని బట్టి మనుషులతో పాటు డ్రోన్లు, ఇతర ఆటోమేషన్ టెక్నాలజీలను ఉపయోగించి ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు చేరవేయాలని ఉబర్ భావిస్తోంది.

ఉబర్ ఇప్పటికే డ్రోన్ డెలివరీ రంగంలో ప్రయోగాలు చేస్తోంది. గతంలో ఫ్లైట్రెక్స్‌ అనే కంపెనీతో కూడా భాగస్వామ్యం చేసుకుంది. ఇప్పుడు జిప్‌లైన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా తన ఆటోమేటెడ్ డెలివరీ వ్యవస్థను మరింత విస్తరించనుంది.

2029 నాటికి కంపెనీల లక్ష్యం నెరవేరితే అమెరికాలో ఉబర్ ఈట్స్‌ డెలివరీ వ్యవస్థలో డ్రోన్లు సాధారణంగా కనిపించే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో మనం ఆర్డర్ చేసిన ఆహారం బైక్‌పై వచ్చే డెలివరీ బాయ్‌ ద్వారా కాకుండా.. నేరుగా ఆకాశం నుంచి డ్రోన్ ద్వారా ఇంటి వద్దకు చేరే రోజులు ఎంతో దూరంలో లేవన్నమాట.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story