Uday Kotak: ముప్పు ముంచుకొస్తుంది.. సిద్ధంగా ఉండండి

Uday Kotak: పశ్చిమాసియా యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం రాబోతోందని ఉదయ్ కోటక్ హెచ్చరించారు.

Naresh.k
Published on: 13 May 2026 9:16 AM IST
Uday Kotak
X

Uday Kotak: ముప్పు ముంచుకొస్తుంది.. సిద్ధంగా ఉండండి

Economic Impact : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం రాబోతోందని ఉదయ్ కోటక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026 వేదికగా ఆయన చేసిన ఈ హెచ్చరికలు సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరినీ ఆలోచనలో పడేశాయి.

ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలు గత రెండు నెలలుగా కొంత శాంతించినట్లు అనిపించినా, అది కేవలం తుపాను ముందున్న నిశ్శబ్దమేనని కోటక్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ యుద్ధం రేపు ఉదయమే ఆగితే తప్ప, మనం ఒక పెద్ద ఆర్థిక కుదుపునకు ఎంతో దూరంలో లేము. ఆ షాక్ మనల్ని తాకే వరకు వేచి చూడకుండా, ఇప్పుడే ముందస్తు చర్యలు తీసుకోవాలి అని ఆయన కుండబద్ధలు కొట్టారు.

ప్రపంచ దేశాల మధ్య సహకారం తగ్గిపోయి, ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకునే తెగవాదం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాణిజ్య మార్గాలు, మలక్కా జలసంధి వంటి కీలక ప్రాంతాలపై నియంత్రణ కోసం దేశాలు ఆరాటపడుతున్నాయని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తుందని వివరించారు.

భారతదేశం తన చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటితే, మన కరెంట్ అకౌంట్ లోటు 2.5 శాతానికి పెరిగిపోతుందని ఉదయ్ కోటక్ అంచనా వేశారు. ఒకవేళ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూసుకుపోతే, గ్యాస్ ,పెట్రోల్ సరఫరా నిలిచిపోయి భారత్ కోలుకోలేని దెబ్బ తింటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రధాని మోదీ సూచించినట్లుగా పొదుపు మంత్రాన్ని పాటించాలని, అనవసర ఖర్చులకు చెక్ పెట్టి ఆర్థికంగా సన్నద్ధం కావాలని కోటక్ సూచించారు. 2008 ఆర్థిక మాంద్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవం ఉన్న కోటక్ వంటి వ్యక్తి హెచ్చరించారంటే, దాని వెనుక ఉన్న తీవ్రతను భారత ప్రజలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story