యూపీఐపై కొత్త ఛార్జీలు.. MDRపై 18% GST భారం
యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు రానున్నాయి. రూ.2,000 దాటిన లావాదేవీలకు 0.4% MDRతో పాటు 18% జీఎస్టీ వర్తించనుంది.
UPI Charges
యూపీఐ చెల్లింపులకు సంబంధించి పెద్ద వ్యాపారులకు అదనపు భారం పడనుంది. రూ.2,000కు మించి చేసే యూపీఐ చెల్లింపులపై వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)పై 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీఎస్టీ పరిధిలో ఉన్న వ్యాపారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందడం ద్వారా ఈ పన్ను భారాన్ని కొంత తగ్గించుకోవచ్చని పన్ను నిపుణులు చెబుతున్నారు.
ప్రతిపాదిత విధానం ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం MDR అమల్లోకి రానుంది. ఈ ఛార్జీకి గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, బీమా, పెట్రోల్ బంకులకు మాత్రం ఫ్లాట్ రేట్‌గా రూ.5 వసూలు చేయనున్నారు.
చెల్లింపు సేవలను వినియోగించుకున్నందుకు విధించే MDR భారాన్ని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. దీనిపై 18 శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుందని పన్ను నిపుణులు వెల్లడించారు. అయితే ఈ జీఎస్టీని వ్యాపారులు తమ అర్హత మేరకు ITC కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఏటా రూ.4 వేల కోట్ల వరకు ఆదాయం
MDRపై 18 శాతం జీఎస్టీ విధించడం ద్వారా కేంద్రానికి ఏటా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఏఎంఆర్‌జీ గ్లోబల్ మేనేజింగ్ పార్ట్‌నర్ రజత్ మోహన్ తెలిపారు. నమోదిత వ్యాపారులు MDRపై చెల్లించిన జీఎస్టీకి ITC క్లెయిమ్ చేసుకోవడం ద్వారా తమ పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు.
లావాదేవీ విలువతో సంబంధం లేకుండా 0.4 శాతం MDRకు మాత్రమే 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని మరో పన్ను నిపుణుడు శివకుమార్ రమ్జీ తెలిపారు. జీఎస్టీ పరిధిలో ఉన్న వ్యాపారులు ITC ద్వారా ఈ భారాన్ని తగ్గించుకోవచ్చని, జీఎస్టీ పరిధిలో లేని వ్యాపారులు మాత్రం MDRతో పాటు దానిపై విధించే జీఎస్టీని కూడా భరించాల్సి ఉంటుందని వివరించారు.
యూపీఐ ఛార్జీలపై కేంద్రం వెనక్కి తగ్గదా?
యూపీఐపై ఛార్జీల విధానంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై పునరాలోచన చేసే అవకాశం లేదని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేసినట్లు సమాచారం.
యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే MDR ఛార్జీల విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. MDR ఛార్జీలపై విపక్ష పార్టీలు, వ్యాపార వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ స్పందన వెలువడింది.




