యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. రోజుకు ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు!

UPI: దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కనిపిస్తున్నాయి.

Mokshith
Published on: 3 Nov 2026 2:56 PM IST
UPI
X

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. రోజుకు ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు!

UPI: దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. పండుగల సీజన్‌లో కొనుగోళ్లు పెరగడంతో రోజువారీ లావాదేవీల సగటు విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును దాటింది.

రోజుకు రూ.లక్ష కోట్లకు పైగా లావాదేవీలు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా రోజుకు సగటున రూ.లక్ష కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఒక నెలలో మొత్తం లావాదేవీల విలువ రూ.30 లక్షల కోట్లను దాటడం కూడా ఇదే తొలిసారి.

అక్టోబర్‌లో మొత్తం రూ.31.53 లక్షల కోట్ల చెల్లింపులు నమోదయ్యాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేయడం, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరగడం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఏ నెలలోనూ ఈ స్థాయిలో లావాదేవీల విలువ నమోదు కాలేదు.

సెప్టెంబర్, మే నెలల రికార్డులు బద్దలు

అక్టోబర్‌కు ముందు రోజువారీ సగటు లావాదేవీల విలువలో సెప్టెంబర్ 2026 మొదటి స్థానంలో ఉండేది. ఆ నెలలో రోజుకు సగటున రూ.98 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. అలాగే ఒక నెలలో అత్యధిక లావాదేవీల విలువ నమోదైన రికార్డు మే 2026 పేరుతో ఉండేది.

ఆ నెలలో రూ.29.9 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. అయితే అక్టోబర్‌లో నమోదైన రూ.31.53 లక్షల కోట్ల లావాదేవీలతో ఈ రెండు రికార్డులు చెరిగిపోయాయి. దీంతో దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో మరోసారి స్పష్టమైంది.

రోజుకు 82 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్లు

లావాదేవీల విలువలోనే కాకుండా వాటి సంఖ్యలోనూ అక్టోబర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నెలలో మొత్తం 25.47 బిలియన్ (2,547 కోట్ల) లావాదేవీలు జరిగాయి. అంటే రోజుకు సగటున 82.1 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య రోజుకు సగటున 80.2 కోట్లుగా ఉంది. అంతకుముందు ఒక నెలలో అత్యధికంగా 24.5 బిలియన్ లావాదేవీలు జరిగిన రికార్డు ఆగస్టు నెలలో నమోదైంది.

సాధారణంగా 30 రోజుల కంటే 31 రోజులున్న నెలల్లో లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని ఎన్‌పీసీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. వినియోగదారులకు ఖర్చు చేసేందుకు అదనంగా ఒక రోజు అందుబాటులో ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా ఏకంగా 89 శాతానికి చేరింది.

దీపావళి తర్వాత ఎండీఆర్ ఛార్జీలు అమలు?

ఒకవైపు యూపీఐ లావాదేవీలు రికార్డులు సృష్టిస్తుండగా.. మరోవైపు కొన్ని రకాల చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమలు చేసే అంశం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఛార్జీల అమలుపై ఎన్‌పీసీఐ గత నెలలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. దీపావళి తర్వాతకు వాయిదా వేసింది.

పండుగల సమయంలో ఈ ఛార్జీలు అమలు చేస్తే వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ కంపెనీలు, చెల్లింపుల సంస్థలు అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా ఎండీఆర్ ఛార్జీల రేట్లు, విధానాలు, వాటిని అమలు చేసే పద్ధతుల విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దీంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆయా సంస్థలు కోరాయి. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత కొన్ని ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.