UPI: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ షాక్..?
UPI: రూ. 2,000 పైబడిన పెద్ద కార్పొరేట్ యూపీఐ లావాదేవీలపై మర్చంట్ ఫీజు విధించే యోచనలో కేంద్రం.
UPI: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ షాక్..?
UPI Merchant Fee: భారతదేశంలో డిజిటల్ విప్లవానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన యూపీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబులో పర్సు ప్రాధాన్యతను తగ్గించేసి, మొబైల్ ఫోనే సర్వస్వం చేసిన ఈ ఉచిత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో త్వరలోనే ఒక అతిపెద్ద విధానపరమైన మార్పు రాబోతోంది.
పెద్ద కార్పొరేట్ సంస్థలు, భారీ వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదా మర్చంట్ ఫీజును తిరిగి తీసుకురావాలని కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. రాబోయే రెండు వారాల్లోనే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఈ ఫీజును అందరిపై రుద్దడం లేదు. కేవలం పెద్ద వ్యాపార రంగాన్ని లక్ష్యంగా చేసుకుని దీనిని రూపొందిస్తున్నారు.
రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపైనే ఈ ఫీజు వర్తించే అవకాశం ఉంది. ఈ మర్చంట్ ఫీజు 0.5 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా. పెద్ద కార్పొరేట్ సంస్థలు, సూపర్ మార్కెట్లు, పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే. మీ జేబుకు ఎలాంటి చిల్లు పడదు. నిధుల బదిలీ కోసం లేదా నిత్యావసరాలు, షాపింగ్ కోసం యూపీఐ వాడే సాధారణ వినియోగదారుల నుండి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు.
మీరు కూరగాయల బండి దగ్గరో, కిరాణా షాపులోనో చేసే లావాదేవీలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫీజు కేవలం పెద్ద వ్యాపారుల నుండి మాత్రమే వసూలు చేస్తారు కాబట్టి సామాన్య ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదట్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం జీరో ఎండీఆర్ విధానాన్ని తెచ్చింది. అంటే ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా సేవలు అందించడం. కానీ ఇప్పుడు యూపీఐ ఊహించని స్థాయికి చేరింది.
కోట్లాది రియల్ టైమ్ లావాదేవీలను ఒక్క సెకనులో సజావుగా ప్రాసెస్ చేయాలంటే బ్యాంకులు, పేమెంట్ యాప్స్ తమ సర్వర్లు, మౌలిక సదుపాయాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేయాలి. దీనికి భారీగా ఖర్చవుతోంది. ప్రస్తుతం రూ. 2,000 లోపు ఉండే లావాదేవీలకు, రూపే డెబిట్ కార్డ్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు సబ్సిడీలను ఇస్తోంది. కానీ వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ ఇది భారం అవుతోంది.
ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం.. రాబోయే 5 నుండి 7 ఏళ్లలో యూపీఐ వ్యవస్థలోకి మరో 60 కోట్ల మంది కొత్త వినియోగదారులు రానున్నారు. నెలకు దాదాపు 100 నుండి 150 బిలియన్ల లావాదేవీలు జరిగే ఛాన్స్ ఉంది. ఇంత భారీ నెట్‌వర్క్‌ను తట్టుకోవాలన్నా, సైబర్ భద్రతను పటిష్టం చేయాలన్నా నిధుల లభ్యత అత్యంత అవసరం. ఉచితంగా అలవాటైన వ్యవస్థలో చిన్న మార్పు వచ్చినా అది సంచలనమే అవుతుంది. అయితే యూపీఐ ఎకోసిస్టమ్ భవిష్యత్తులోనూ ఎలాంటి అంతరాయం లేకుండా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఇలాంటి ఫీజులు తప్పవని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.




