UPI: యూపీఐ వ్యవస్థలో సంచలనం.. ఏఐ ఏజెంట్‌తో పేమెంట్స్.?
UPI: భారత్‌లో డిజిటల్ పేమెంట్లను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక చర్యలు తీసుకుంటోంది.
UPI: యూపీఐ వ్యవస్థలో సంచలనం.. ఏఐ ఏజెంట్‌తో పేమెంట్స్.?
UPI: త్వరలో UPI ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లు వినియోగదారుల తరఫున చిన్న మొత్తాల చెల్లింపులు చేసే అవకాశం రావచ్చు. ఇందుకోసం NPCI 'యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్' అనే కొత్త ఫ్రేమ్‌వర్క్‌పై పని చేస్తున్నట్లు సమాచారం.
ఉదాహరణకు.. మీరు మీ AI ఏజెంట్‌కు వారానికి రూ.2,000 బడ్జెట్‌లో ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులు కొనుగోలు చేయాలని ఆదేశిస్తే, ఆ ఏజెంట్ స్వయంగా ఉత్పత్తులను ఎంపిక చేస్తుంది. ధరలను పోల్చి చూస్తుంది. మీ బడ్జెట్‌కు తగ్గట్లుగా కొనుగోలు చేసి UPI ద్వారా పేమెంట్ కూడా పూర్తి చేస్తుంది. ప్రతిసారీ మీరు UPI పిన్ ఎంటర్ చేసి అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
AI ఏజెంట్‌కు పరిమిత పేమెంట్ అధికారం
ప్రతిపాదిత కొత్త వ్యవస్థలో వినియోగదారులు తమ AI ఏజెంట్‌కు పరిమిత ఆర్థిక అధికారాన్ని ఇవ్వగలరు. అంటే ముందుగానే కొన్ని నిబంధనలు నిర్ణయించుకోవచ్చు. AI ఏజెంట్ ఎప్పుడు పేమెంట్ చేయాలి, గరిష్టంగా ఎంత మొత్తాన్ని ఖర్చు చేయాలి, ఎలాంటి కొనుగోళ్లకు అనుమతి ఉంటుంది. వినియోగదారు నిర్ణయించిన పరిమితులకు లోబడే AI ఏజెంట్ పనిచేస్తుంది. ఉదాహరణకు నెలలో లేదా వారంలో నిర్ణయించిన బడ్జెట్‌లో కిరాణా సరుకులు కొనుగోలు చేయాలని ఆదేశిస్తే, ఆ షరతులకు అనుగుణంగా ఉంటే ఏజెంట్ స్వయంగా పేమెంట్ పూర్తి చేస్తుంది.
మొదట్లో ఈ సేవను తక్కువ మొత్తంలో తరచుగా జరిగే లావాదేవీల కోసం తీసుకురావచ్చని భావిస్తున్నారు. కిరాణా కొనుగోళ్లు, పాలు, కరెంట్ బిల్లులు వంటి రెగ్యులర్ పేమెంట్లకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.
యూపీఐ సర్కిల్, రివర్స్ పే ఆధారంగా కొత్త వ్యవస్థ
ఈ కొత్త AI పేమెంట్ విధానానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న యూపీఐ సర్కిల్, రిజర్వ్‌పే వంటి ఫీచర్లు ఆధారంగా మారే అవకాశం ఉంది.
యూపీఐ సర్కిల్: ప్రస్తుతం ప్రధాన ఖాతాదారు కుటుంబ సభ్యులకు నిర్దిష్ట పరిమితితో పేమెంట్ చేసే అధికారాన్ని ఇవ్వవచ్చు. ఇదే తరహాలో AI ఏజెంట్‌కు కూడా ఖర్చు పరిమితిని నిర్ణయించి అనుమతి ఇచ్చే విధానం రావచ్చు.
రిజర్వ్ పే: భవిష్యత్తులో జరగబోయే లావాదేవీల కోసం ముందుగానే కొంత మొత్తాన్ని రిజర్వ్ లేదా బ్లాక్ చేసే విధానం ఇది. ప్రస్తుతం కొన్ని నిబంధనల ప్రకారం బ్యాంకులు నిర్దిష్ట కాలానికి పరిమిత మొత్తాన్ని బ్లాక్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. AI ఆధారిత పేమెంట్ల కోసం ఈ పరిమితులు, కాల వ్యవధిలో మార్పులు రావచ్చు.
ఈ విధానం అమల్లోకి వస్తే ఈ-కామర్స్ రంగంలో కూడా పెద్ద మార్పులు కనిపించవచ్చు. ప్రస్తుతం AI ప్రోడక్టులను వెతకడం, ధరలను పోల్చడం వరకు మాత్రమే పరిమితమవుతోంది. భవిష్యత్తులో వినియోగదారు అనుమతించిన పరిమితుల్లో కొనుగోలు నుంచి పేమెంట్ వరకు మొత్తం ప్రక్రియను AI పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
భద్రతే అతిపెద్ద సవాల్.. తప్పు పేమెంట్ అయితే బాధ్యత ఎవరిది?
AI ఏజెంట్లకు పేమెంట్ చేసే స్వేచ్ఛ ఇవ్వడం ఎంత సౌకర్యవంతమో, భద్రత పరంగా అంతే సవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే కొత్త వ్యవస్థలో స్పెండింగ్ లిమిట్స్, ఐడెంటిటీ వెరిఫికేషన్, ప్రతి లావాదేవీకి సంబంధించిన రికార్డు వంటి భద్రతా చర్యలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే AI ఏజెంట్ పొరపాటున తప్పు పేమెంట్ చేస్తే ఏం జరుగుతుంది? సైబర్ మోసం జరిగితే బాధ్యత ఎవరిది? వినియోగదారుడిదా, బ్యాంకుదా, వ్యాపార సంస్థదా లేక AI సాఫ్ట్‌వేర్ కంపెనీదా? వంటి ప్రశ్నలకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాల్సి ఉంది.
భారత్‌లో ఇప్పటికే UPI భారీ స్థాయిలో ఉపయోగంలో ఉంది. ఈ విస్తృతమైన డిజిటల్ పేమెంట్ నెట్‌వర్క్‌కు AI ఏజెంట్లు జతైతే 'ఏజెంటిక్ కామర్స్'కు కొత్త దశ ప్రారంభం కావచ్చు. అంటే మనం కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే.. ప్రోడక్ట్ ఎంపిక, ధరల పోలిక, కొనుగోలు, పేమెంట్ వంటి పనులన్నింటినీ AI ఏజెంట్ స్వయంగా పూర్తి చేసే రోజులు త్వరలోనే రావచ్చన్న మాట




