UPI Payments: అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా.. UPI పేమెంట్స్ చేయొచ్చని తెలుసా.?
UPI Payments: భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడీ వ్యవస్థను మరింత సులభతరం చేసేలా 'క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అందుబాటులోకి తీసుకొచ్చారు.
UPI Payments: అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా.. UPI పేమెంట్స్ చేయొచ్చని తెలుసా.?
UPI Payments: భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడీ వ్యవస్థను మరింత సులభతరం చేసేలా 'క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ వల్ల బ్యాంక్ ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకున్నా UPI పేమెంట్ ఎలా సాధ్యం?
సాధారణంగా యూపీఐ ద్వారా చెల్లింపు చేయాలంటే మీ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. కానీ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సౌకర్యం ద్వారా ఈ నిబంధన మారుతోంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి బ్యాంకు ముందుగానే ఒక నిర్దిష్ట రుణ పరిమితి (Pre-approved Loan Limit) ఇస్తుంది. ఉదాహరణకు బ్యాంకు మీకు రూ.50,000 వరకు క్రెడిట్ లిమిట్ మంజూరు చేసిందనుకుందాం. అలాంటి సమయంలో మీ ఖాతాలో డబ్బు లేకపోయినా, దుకాణంలో QR కోడ్ స్కాన్ చేసి రూ.5,000 విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే, ఆ మొత్తం మీ ఖాతా నుంచి కాకుండా బ్యాంకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్ నుంచి చెల్లిస్తారన్నమాట.
క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటే ఏమిటి?
క్రెడిట్ లైన్ అంటే బ్యాంకు ముందుగానే మీ కోసం ఆమోదించిన రుణ పరిమితి. ఇది మీ ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వంటి అంశాలను పరిశీలించి నిర్ణయిస్తారు. అవసరం వచ్చినప్పుడు ఈ లిమిట్‌లోని డబ్బును యూపీఐ ద్వారా వినియోగించుకోవచ్చు. తర్వాత బ్యాంకు నిర్ణయించిన గడువులోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
ఒకేసారి మొత్తం చెల్లించే పరిస్థితి లేకపోతే, దానిని ఈఎంఐ (EMI) రూపంలో కూడా చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు సమకూరినట్లే అవుతుంది.
క్రెడిట్ కార్డుకు దీనికి తేడా ఏంటి?
చాలామందికి ఇది క్రెడిట్ కార్డు లాగే అనిపించవచ్చు. కానీ రెండింటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.
క్రెడిట్ కార్డు ఉపయోగించాలంటే ముందుగా RuPay క్రెడిట్ కార్డు ఉండాలి. ఆ కార్డును Google Pay, PhonePe, Paytm వంటి యూపీఐ యాప్‌లకు లింక్ చేయాలి. క్రెడిట్ కార్డుకు ప్రత్యేక బిల్లింగ్ సైకిల్, వడ్డీ, ఇతర ఛార్జీలు ఉంటాయి.
అయితే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐలో ప్రత్యేకంగా కార్డు అవసరం లేదు. ఇది నేరుగా మీ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండే డిజిటల్ రుణ సౌకర్యం. యూపీఐ ద్వారా సాధారణ పేమెంట్ చేసినట్టే ఈ సేవను ఉపయోగించవచ్చు.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం.?
ఈ కొత్త సౌకర్యం ముఖ్యంగా చిన్న వ్యాపారులు, చిరు దుకాణదారులు, వీధి వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, డెలివరీ ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు వంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రోజువారీ వ్యాపారం కోసం సరుకులు కొనుగోలు చేయాల్సిన సమయంలో బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా, వెంటనే యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
దీంతో చిన్న మొత్తాల కోసం అప్పులు అడగాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్‌ను ఉపయోగించి వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.
ఈ డబ్బును ఎక్కడైనా ఖర్చు చేయచ్చా?
ఈ సౌకర్యం ఉన్నంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేయడం సాధ్యం కాదు. బ్యాంకులు లేదా రుణం ఇచ్చే సంస్థలు కొన్ని పరిమితులు విధించే అవకాశం ఉంది.
ఉదాహరణకు వైద్య ఖర్చులు, వ్యాపార అవసరాలు లేదా నిర్దిష్ట కొనుగోళ్ల కోసం మాత్రమే ఈ క్రెడిట్ లిమిట్‌ను ఉపయోగించేలా నిబంధనలు ఉండొచ్చు. విలాసవంతమైన హోటళ్లలో ఖర్చు చేయడం లేదా అనుమతి లేని లావాదేవీలకు దీనిని ఉపయోగించలేకపోవచ్చు.
ఇలాంటి పరిమితుల వల్ల రుణాల దుర్వినియోగం, మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.




