UPI Privacy Changes: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా..? సెప్టెంబర్ 4 నుంచి అదిరిపోయే సేఫ్టీ ఫీచర్..!
UPI Privacy Changes: గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపుతున్నప్పుడు మీ ఫోన్ నంబర్ ఎదుటివారికి కనిపిస్తోందని కంగారు పడుతున్నారా? ఆ టెన్షన్ ఇక అక్కర్లేదు! మన వ్యక్తిగత వివరాల భద్రత కోసం ఎన్‌పీసీఐ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
UPI Privacy Changes: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా..? సెప్టెంబర్ 4 నుంచి అదిరిపోయే సేఫ్టీ ఫీచర్..!
UPI Privacy Changes: దేశంలో టీ కొట్టు దగ్గరి నుంచి బట్టల షాపు వరకు.. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్నదానికి మనం యూపీఐ పేమెంట్స్ పైనే ఆధారపడుతున్నాం. జేబులో పర్సు లేకపోయినా బతికేయొచ్చు కానీ, స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్, యూపీఐ యాప్ లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి వచ్చేసింది. కూరగాయల మార్కెట్లలో పది రూపాయలు చెల్లించాలన్నా సరే స్కాన్ చేయడానికే జనాలు మొగ్గుచూపుతున్నారు. ఇంతలా మన జీవితాల్లో భాగమైన డిజిటల్ పేమెంట్లలో కస్టమర్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెచ్చిన డీపీడీపీ (డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్) చట్టం ఆధారంగా సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి దిగ్గజ సంస్థలతో పాటు భాగస్వామ్య బ్యాంకులతో ఇప్పటికే ఈ విషయంపై ఎన్‌పీసీఐ విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది.
నంబర్లకు ఇక 'మాస్కింగ్' రక్షణ..
మనం ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు మన ఫోన్ నంబర్, అలాగే మన బ్యాంకు ఖాతా వివరాలు అవతలి వ్యక్తికి ఇట్టే తెలిసిపోతున్నాయి. దీనివల్ల ప్రైవసీకి తీవ్ర విఘాతం కలుగుతోందనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన ఆరోపణ. దీనికి చెక్ పెట్టేలా ఎన్‌పీసీఐ కొన్ని కీలకమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మీ పూర్తి మొబైల్ నంబర్ ఎదుటివారికి ఏమాత్రం కనిపించదు. కేవలం మీ ఫోన్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు మాత్రమే వారి స్క్రీన్ మీద దర్శనమిస్తాయి. ఈ సరికొత్త ప్రక్రియను టెక్నికల్ భాషలో 'మాస్కింగ్' అని పిలుస్తారు. దీనివల్ల లావాదేవీ సమయంలో మన వ్యక్తిగత నంబర్ బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తపడొచ్చు. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తులకు పేమెంట్ చేసేటప్పుడు ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా భయపడక్కర్లేదు..
దుకాణాలకు వెళ్లినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం మనందరికీ అలవాటే. ఆ సమయంలో మర్చంట్ యాప్‌లలో మన ఫోన్ నంబర్ రికార్డ్ అవుతూ ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయబోతున్నారు. దుకాణంలో స్కాన్ చేసి డబ్బులు చెల్లించిన తర్వాత కూడా స్వీకరించే యాప్‌లో కస్టమర్ పూర్తి వివరాలు కనిపించకుండా ఎన్‌పీసీఐ సరికొత్త సాంకేతిక మార్పులు చేయిస్తోంది. సెప్టెంబర్ 4వ తేదీ లోపు ఈ ప్రైవసీ విధానాన్ని అన్ని యూపీఐ యాప్‌లు, బ్యాంకులు తమ సిస్టమ్స్‌లో తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని ఒక డెడ్‌లైన్ కూడా విధించింది. ఆ రోజు నుంచి కస్టమర్ ఫేసింగ్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా ప్రైవసీ ఫ్రెండ్లీగా మారిపోనుంది.
ఫోన్ నంబర్‌కు బదులు యూజర్‌నేమ్ ఐడీలు..
సాధారణంగా చాలామంది యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకునేటప్పుడు తమ ఫోన్ నంబర్‌నే వర్చువల్ పేమెంట్ అడ్రస్‌గా (వీపీఏ) పెట్టుకుంటున్నారు. కొత్తగా రిజిస్టర్ అయ్యేవారు కూడా ఇదే విధానాన్ని బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు. ఈ అలవాటును పూర్తిగా మార్చాలని ఎన్‌పీసీఐ స్పష్టమైన ప్రణాళికలు రచిస్తోంది. మన పేరుతోనే ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్ ఐడీని క్రియేట్ చేసుకునేలా యాప్‌లు కస్టమర్లను ప్రోత్సహించాలి. ఒక వ్యక్తి పేరు రమేష్ అయితే, అతని ఫోన్ నంబర్ కాకుండా 'Ramesh@upi' లాంటి ఐడీని డీఫాల్ట్‌గా ఇచ్చేలా సిస్టమ్‌ను డిజైన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రైవసీ సమస్యలను దాదాపుగా జీరో స్థాయికి తీసుకురావచ్చని సైబర్ నిపుణులు బలంగా చెబుతున్నారు.
ప్రైవసీకి పెద్ద పీట.. సైబర్ నేరాలకు చెక్..
డిజిటల్ లావాదేవీలు సురక్షితంగానే ఉన్నప్పటికీ మన ఫోన్ నంబర్లు ఇలా బహిర్గతం కావడం వల్ల విపరీతమైన స్పామ్ కాల్స్ వస్తున్నాయి. టెలిమార్కెటింగ్ వాళ్ల బెడద బాగా ఎక్కువైపోతోంది. అలాగే సైబర్ నేరగాళ్లు మన డేటాను దొంగిలించి రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటన్నింటికి ఒకే దెబ్బతో చెక్ పెట్టేలా ఈ సరికొత్త మార్పులు రాబోతున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కస్టమర్ల అనుమతి లేకుండా డేటా లీక్ అయ్యే ప్రసక్తే ఉండదు. సామాన్య ప్రజలు సైతం ఎలాంటి భయం లేకుండా ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకునేలా ఈ మార్పులు దోహదం చేయనున్నాయి.




