UPI: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్.. త్వ‌ర‌లోనే ‘ట్యాప్ టు పే’ ఫీచర్

UPI: భారత్‌లో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కీలక అడుగు వేయనుంది.

Mokshith
Published on: 22 July 2026 12:13 PM IST
UPI
X

UPI: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్.. త్వ‌ర‌లోనే ‘ట్యాప్ టు పే’ ఫీచర్

UPI: భారత్‌లో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కీలక అడుగు వేయనుంది. త్వరలో ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పించే కొత్త ‘ట్యాప్ టు పే’ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్ ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త విధానంలో ఎన్‌ఎఫ్‌సీ (NFC - నియ‌ర్ ఫీల్డ్ క‌మ్యూనికేష‌న్‌) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను PoS (పాయింట్ ఆఫ్ సేల్‌) టెర్మినల్‌పై ట్యాప్ చేయడం ద్వారా చెల్లింపు పూర్తవుతుంది. ఈ సమయంలో ఫోన్‌కైనా, PoS టెర్మినల్‌కైనా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదు. వినియోగదారులు ముందుగానే ఇంటర్నెట్ ఉన్నప్పుడు తమ UPI లైట్ వ్యాలెట్‌లో డబ్బు లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బ్యాలెన్స్‌తో ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు.

రూ.2,000 వరకు చెల్లింపు.. UPI పిన్ అవసరం లేదు

కొత్త వ్యవస్థలో ఒక్కో ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ.2,000 వరకు చెల్లించే అవకాశం ఉండొచ్చని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఈ చెల్లింపులకు ప్రతి సారి UPI పిన్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. వినియోగదారు ఫోన్‌ను PoS టెర్మినల్‌పై ట్యాప్ చేస్తే పేమెంట్‌ ఆమోదం నమోదు అవుతుంది. టెర్మినల్ ఆ వివరాలను తనలో భద్రపరుస్తుంది. తర్వాత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆ ట్రాన్సాక్షన్‌ను బ్యాంక్ సర్వర్‌కు పంపి ధృవీకరణ పూర్తి చేస్తుంది.

PoS కంపెనీలకు NPCI సర్టిఫికేషన్ తప్పనిసరి

ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే వ్యాపార సంస్థలు ఉపయోగించే PoS టెర్మినల్స్‌కు NPCI సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. సర్టిఫికేషన్ పొందిన తర్వాతే ఆ టెర్మినల్స్ ఈ ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తాయి. అలాగే బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్‌లు కూడా తమ యాప్‌ల్లో ఈ ఫీచర్‌ను అందించేందుకు అవసరమైన మార్పులు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కార్డులు అవసరం లేకుండానే మొబైల్‌తో ట్యాప్ చేసి చెల్లింపులు చేయడం మరింత సులభం కానుంది.

UPI Lite Xకు కొనసాగింపేనా?.. RBI నిబంధనలు ఏం చెబుతున్నాయి?

NPCI ఇప్పటికే 2023లో UPI Lite Xను పరిచయం చేసింది. ఇది కూడా పరిమిత స్థాయిలో ఆఫ్‌లైన్ చెల్లింపులను అనుమతించే విధానమే. అయితే ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త ఫీచర్‌లో సాధారణ PoS టెర్మినల్స్‌కూ ఆఫ్‌లైన్ యూపీఐ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం RBI ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్ నిబంధనల ప్రకారం సాధారణ ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్ పరిమితి రూ.500గా ఉంది. అయితే కొత్త వ్యవస్థలో ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.2,000 వరకు అనుమతించే ప్రతిపాదన ఉందని నివేదిక వెల్లడించింది. దీనిపై NPCI ఇంకా అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది.

దేశంలో వేగంగా పెరుగుతున్న UPI వినియోగం

UPI వినియోగం దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. NPCI గణాంకాల ప్రకారం 2026 జూన్ నెలలో 22.72 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.28.92 లక్షల కోట్లు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే ట్యాప్ టు పే ఫీచర్ అందుబాటులోకి వస్తే యూపీఐ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. విమాన ప్రయాణాలు, భూగర్భ రైల్వేలు, నెట్‌వర్క్ బలహీనంగా ఉండే ప్రాంతాల్లో ఈ సౌకర్యం వినియోగదారులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story