Urea Price: భారత యూరియా టెండర్‌లో ధరలు దాదాపు 10% తగ్గాయి.. రైతులకు ఊరట
Urea Price: భారత్ తాజా యూరియా టెండర్‌లో ధరలు దాదాపు 10% తగ్గాయి. రబీ సీజన్ ముందు రైతులకు ఇది ఎలా ఊరటనిస్తుందో తెలుసుకోండి.
Urea Price: భారత యూరియా టెండర్‌లో ధరలు దాదాపు 10% తగ్గాయి.. రైతులకు ఊరట
Urea Price: ప్రపంచంలోనే ప్రధాన ఎరువుల దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌కు తాజాగా యూరియా ధరల్లో కొంత ఊరట లభించింది. దేశం నిర్వహించిన తాజా యూరియా టెండర్‌లో ఆఫర్లు గత ఆగస్టు కొనుగోలు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం తక్కువగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఇంధనం వంటి వ్యవసాయ పెట్టుబడుల ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ ధరల తగ్గుదల రైతులకు కొంత ఉపశమనం కలిగించే అవకాశముంది.
ప్రభుత్వం తరఫున యూరియాను దిగుమతి చేసుకునే ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నిర్వహించిన టెండర్ బుధవారం ముగిసింది. ఈ టెండర్‌లో పశ్చిమ తీరానికి సరఫరా చేసేందుకు టన్నుకు 356.25 డాలర్ల నుంచి 416.50 డాలర్ల మధ్య ఆఫర్లు వచ్చినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. తూర్పు తీరానికి సరఫరాల కోసం టన్నుకు 352.10 డాలర్ల నుంచి 465 డాలర్ల వరకు ఆఫర్లు వచ్చాయి.
ముఖ్యంగా రెండు ప్రాంతాల్లోనూ ప్రభుత్వం కోరిన పరిమాణానికి రెట్టింపు కంటే ఎక్కువ మొత్తంలో యూరియా సరఫరాకు ఆఫర్లు రావడం గమనార్హం. ఇది సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే సంకేతంగా మార్కెట్ వర్గాలు చూస్తున్నాయి.
గతంలో టన్నుకు 959 డాలర్ల వరకు ధర
భారత్ నిర్వహించే యూరియా టెండర్లను ప్రపంచ ఎరువుల మార్కెట్‌లో ధరల బెంచ్‌మార్క్‌గా ఇతర దిగుమతిదారులు కూడా నిశితంగా గమనిస్తుంటారు. ముఖ్యంగా ఇరాన్‌లో యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం నుంచి యూరియా సరఫరాలు దెబ్బతిన్న సమయంలో ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి.
ఈ ఏడాది ప్రారంభంలో సరఫరాలపై ఒత్తిడి పెరిగిన సమయంలో భారత్ టన్ను యూరియాకు ఏకంగా 959 డాలర్ల వరకు చెల్లించింది. అయితే ఆ తర్వాత సరఫరా ఆంక్షలు కొంత సడలడం, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బలహీనపడటంతో ధరలు భారీగా తగ్గాయి.
ఆగస్టులో జరిగిన భారత్ చివరి యూరియా టెండర్‌లో టన్నుకు 390.25 డాలర్ల నుంచి 393.65 డాలర్ల మధ్య ధరలకు సరఫరాలను కొనుగోలు చేసింది. దీంతో తాజాగా వచ్చిన తక్కువ ఆఫర్లు అంతర్జాతీయ యూరియా మార్కెట్‌లో ధరలపై ఒత్తిడి తగ్గుతున్నట్లు సూచిస్తున్నాయి.
రైతులకు ఎలా ఉపయోగం?
యూరియా ధరలు తగ్గడం భారత రైతులకు పరోక్షంగా ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలోని రైతులు రాబోయే రబీ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. గోధుమ, ఆవాలు, శనగ వంటి పంటల సాగు ప్రారంభం కానుండటంతో యూరియాకు డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది.
పంటల పెరుగుదలకు అవసరమైన కీలక నత్రజని ఆధారిత పోషకాల్లో యూరియా ఒకటి. సాగు సమయంలో రైతులకు ఎరువుల లభ్యత, ధరలు రెండూ కీలకంగా మారతాయి. దిగుమతి ధరలు తగ్గితే.. దేశంలో ఎరువుల సరఫరాపై ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
మరోవైపు డీజిల్ వంటి ఇతర వ్యవసాయ ఇన్‌పుట్‌ల ధరలు అధికంగా ఉండటంతో రైతులపై ఇప్పటికే పెట్టుబడి భారం పెరిగింది. ఈ పరిస్థితుల్లో యూరియా దిగుమతి ధరలు తగ్గడం వ్యవసాయ రంగానికి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.
ప్రభుత్వ సబ్సిడీ భారం కూడా తగ్గే అవకాశం
యూరియా దిగుమతి ధరలు తగ్గడం రైతులకే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. దేశంలో ఎరువుల ధరలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం గణనీయమైన సబ్సిడీని భరిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరుగుతుంది. ప్రస్తుతం దిగుమతి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో.. ఇదే ధోరణి కొనసాగితే ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ బిల్లుపై ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది.
తాజా టెండర్ ధరలపై ఎరువుల మంత్రిత్వ శాఖ స్పందన కోరినప్పటికీ.. ఈ విషయంపై వెంటనే ఎలాంటి అధికారిక వ్యాఖ్య వెలువడలేదు. అయితే అంతర్జాతీయ సరఫరాలు, ఇంధన ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో యూరియా ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.




