Visakhapatnam Port Authority: సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో నంబర్‌వన్‌గా విశాఖ పోర్టు
విశాఖ పోర్టు ద్వారా దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. 2025లో 50.87% వాటాతో భారత్‌లో అగ్ర ఎగుమతి కేంద్రంగా నిలిచింది.
Visakhapatnam Port Authority
Visakhapatnam Port Authority : దేశంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) ప్రధాన కేంద్రంగా ఎదిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జూలై 21న ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023–మార్చి 2024) దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో విశాఖ పోర్టు వాటా 29.67 శాతం ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది 50.87 శాతానికి పెరిగింది. కేవలం ఏడాదిలోనే 21 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం విశాఖ పోర్టు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్రం తెలిపింది.
ఈ గణాంకాలు విశాఖపట్నం పోర్టు దేశంలోనే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన ద్వారంగా ఎదిగిందని సూచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ పోర్టు ద్వారా సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు మరింత ఊతం లభించిందని పేర్కొంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా విశాఖ పోర్టు 48.89 శాతం వాటాను కొనసాగించడం ద్వారా దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.
అలాగే 'వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్' (ODOP) కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు కీలక ఎగుమతి కేంద్రంగా పనిచేస్తోందని కేంద్రం వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రదర్శనలు, GeM ODOP బజార్, కొనుగోలుదారులు–అమ్మకందారుల సమావేశాలు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 99 ఓడీఓపీ ఉత్పత్తులను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్ర ఎగుమతి అవకాశాలను మరింత విస్తరించడమే లక్ష్యమని పేర్కొంది.




