VodafoneIdea: వోడాఫోన్-ఐడియా దశ తిరగబోతోందా? Vi భవిష్యత్తును మార్చబోతున్న రూ.50 వేల కోట్ల పెట్టుబడి!

వోడాఫోన్ ఐడియా (Vi)లో రూ.50 వేల కోట్ల భారీ పెట్టుబడులకు JSW గ్రూప్, విదేశీ సంస్థలు సిద్ధమవుతున్నాయా? కేంద్ర ప్రభుత్వం అందించిన ఊరటతో కంపెనీ దశ ఎలా తిరగబోతోంది? AGR బకాయిల తగ్గింపు, 5G నెట్‌వర్క్ విస్తరణపై విశ్లేషణాత్మక స్టోరీ చదవండి.

Ganesh
Published on: 14 March 2026 5:22 PM IST
VodafoneIdea: వోడాఫోన్-ఐడియా దశ తిరగబోతోందా? Vi భవిష్యత్తును మార్చబోతున్న  రూ.50 వేల కోట్ల పెట్టుబడి!
X

VodafoneIdea: వోడాఫోన్-ఐడియా దశ తిరగబోతోందా? Vi భవిష్యత్తును మార్చబోతున్న రూ.50 వేల కోట్ల పెట్టుబడి!  

VodafoneIdea: గత కొంతకాలంగా అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) త్వరలోనే గడ్డు పరిస్థితుల నుంచి బయటపడబోతున్నట్లు సమాచారం. ఈ కంపెనీని ఆదుకోవడానికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం JSW గ్రూప్‌తో పాటు విదేశీ ఇన్వెస్టర్లు విశేషమైన ఆసక్తిని కనబరుస్తుండటమే దీనికి ప్రధాన కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారిన తర్వాత, ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడం విశేషం.

పెట్టుబడుల రేసులో దిగ్గజ సంస్థలు..

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వోడాఫోన్ ఐడియాలో వాటాల కొనుగోలుకు సంబంధించి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. సజ్జన్ జిందాల్‌కు చెందిన JSW గ్రూప్, సింగపూర్‌కు చెందిన ST టెలిమీడియా, యూఎస్ ఆధారిత టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మరికొన్ని భారతీయ సంస్థలు ఈ కంపెనీలో పెట్టుబడుల రేసులో ఉన్నాయి. పెట్టుబడుల సేకరణ కోసం కంపెనీ అగ్ర నాయకత్వం మార్చి 16, 17 తేదీల్లో సింగపూర్, హాంకాంగ్‌లలోని సంస్థాగత పెట్టుబడిదారులతో కీలక భేటీలు నిర్వహించనుంది.

రూ.50 వేల కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్..

బ్రోకరేజ్ సంస్థ IIFL సెక్యూరిటీస్ నివేదికల ప్రకారం.. ఈ కంపెనీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక ఆసక్తికరమైన వ్యూహం సిద్ధమవుతోంది. వ్యూహాత్మక పెట్టుబడిదారుల ద్వారా కంపెనీలోకి సుమారు రూ.50 వేల కోట్ల నిధులను తీసుకురావడం ఈ వ్యూహంలో భాగం. దీని ద్వారా కంపెనీ తన స్పెక్ట్రమ్ అప్పులను 40 శాతానికి తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. కొత్త పెట్టుబడులు వచ్చినా ప్రభుత్వ వాటా 49 శాతం మించకుండా జాగ్రత్త పడుతూనే, మరో రూ.48 వేల కోట్ల స్పెక్ట్రమ్ బాధ్యతలను ప్రభుత్వం ఈక్విటీగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో మార్చి చివరి నాటికి సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిల పునఃపరిశీలన ప్రక్రియ పూర్తి కానుంది. దీనివల్ల కంపెనీ అప్పులు 50 నుంచి 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. అంతేకాకుండా, బకాయిల చెల్లింపులకు 10 ఏళ్ల వరకు గడువు లభిస్తే, కొత్త ఇన్వెస్టర్లకు కంపెనీపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉండగా, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు 9.50%, యూకే వోడాఫోన్ గ్రూప్‌కు 16.07% వాటాలు ఉన్నాయి. కొత్త ఇన్వెస్టర్ రాకతో పాత ప్రమోటర్లు తమ వాటాను విక్రయిస్తారా లేదా కంపెనీ కొత్త షేర్లను జారీ చేస్తుందా అనేది త్వరలోనే తేలనుంది. ఈ భారీ పెట్టుబడులు గనుక కార్యరూపం దాల్చితే, టెలికాం మార్కెట్లో వోడాఫోన్ ఐడియా మళ్లీ బలమైన పోటీదారుగా నిలబడటమే కాకుండా, కస్టమర్లకు మెరుగైన 5G సేవలు అందే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ganesh

Ganesh

Next Story