Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు
Indian Railways : భారతీయ రైల్వే పశ్చిమ మధ్య రైల్వే జోన్‌లో తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
Indian Railways
Indian Railways : భారతీయ రైల్వే పరిధిలోని పశ్చిమ మధ్య రైల్వే (WCR) జోన్ పరిధిలో తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులను ప్రకటించింది. రాబోయే ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, ప్రయాణికుల రద్దీని తగ్గించడం, పారదర్శకతను పెంచడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. కొత్త విధానం అమలులోకి రావడం వల్ల ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల చుట్టూ రెండుసార్లు తిరగాల్సిన అవసరం ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఏసీ, నాన్-ఏసీ తరగతులకు కొత్త బుకింగ్ సమయాలు
పశ్చిమ మధ్య రైల్వే జోన్ ప్రకటించిన కొత్త ప్లాన్ ప్రకారం టికెట్ల టోకెన్ పంపిణీ, బుకింగ్ సమయాలను దగ్గర చేశారు. కొత్త సమయాల కింద ఏసీ తరగతుల తత్కాల్ టికెట్ల టోకెన్ పంపిణీ ఉదయం 8:30 నుంచి 9:00 గంటల వరకు జరుగుతుంది. నాన్-ఏసీ (స్లీపర్) తరగతుల టికెట్ల టోకెన్ పంపిణీ ఉదయం 9:00 నుంచి 9:30 గంటల వరకు ఉంటుంది. దీనికి విరుద్ధంగా ప్రస్తుతం ఉన్న విధానంలో ఏసీ కోచ్‌లకు ఉదయం 9:00 నుంచి 9:25 గంటల మధ్య, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 9:30 నుంచి 9:55 గంటల మధ్య టోకెన్లు ఇస్తున్నారు.
కౌంటర్ల వద్ద వేచి ఉండే సమయానికి చెక్
పాత విధానంలో ఏసీ, స్లీపర్ క్లాసులకు ఉదయం 8 గంటలకే టోకెన్ల పంపిణీ ప్రారంభమయ్యేది. అయితే ఏసీ తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ బుకింగ్ ఉదయం 11 గంటలకు మాత్రమే ప్రారంభమయ్యేవి. దీనివల్ల ప్రయాణికులు టోకెన్ తీసుకున్న తర్వాత గంటల తరబడి వేచి ఉండటం లేదా ఇంటికి వెళ్లి మళ్లీ కౌంటర్‌కు రావడం జరిగేది. ఈ సమయ వ్యత్యాసాన్ని తగ్గించి ప్రయాణికుల అమూల్యమైన సమయాన్ని ఆదా చేసేందుకే టోకెన్ పంపిణీ సమయాన్ని బుకింగ్ సమయానికి దగ్గరగా మార్చారు.
దళారుల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు
కౌంటర్ల వద్ద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం, దళారుల దోపిడీని అరికట్టడానికే ఈ మార్పులు చేసినట్లు సీనియర్ రైల్వే కమిషనర్ సౌరభ్ కటారియా వెల్లడించారు. అంతేకాకుండా అక్రమాలను నిరోధించడానికి ప్రతి రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఏసీ తరగతికి గరిష్టంగా 10 టికెట్లు, నాన్-ఏసీ తరగతికి గరిష్టంగా 15 టికెట్లు మాత్రమే జారీ చేసేలా పరిమితి విధించారు.




