Fertiliser Production: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: దేశీయ ఎరువుల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..!
Fertiliser Production: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌లో ఎరువుల ఉత్పత్తిపై పడింది. మార్చి నెలలో ఎరువుల తయారీ 24.6 శాతం తగ్గింది.
Fertiliser Production: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: దేశీయ ఎరువుల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..!
Fertiliser Production: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ మేఘాలు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మార్చి నెలలో ఎరువుల తయారీ దాదాపు నాలుగో వంతు (24.6 శాతం) మేర క్షీణించినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
యూరియా వంటి ఎరువుల తయారీకి 'సహజ వాయువు' (Natural Gas) అత్యంత కీలకం. భారత్ తన అవసరాల కోసం పశ్చిమాసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయితే, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల దేశీయ ఎరువుల పరిశ్రమలకు ముడి పదార్థాల కొరత ఏర్పడి ఉత్పత్తి కుంటుపడింది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ఎరువుల ఉత్పత్తి మార్చిలో అకస్మాత్తుగా పడిపోయింది.
డిసెంబర్: 4.1% వృద్ధి
జనవరి: 3.7% వృద్ధి
ఫిబ్రవరి: 3.4% వృద్ధి
మార్చి: 24.6% క్షీణత
రైతన్నలకు ఇబ్బంది లేకుండా చర్యలు:
ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్ (జూన్-జూలై) నేపథ్యంలో ఎరువులకు విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు భారం పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఉత్పత్తి తగ్గినా, ప్రస్తుతానికి దేశంలో తగినంత ఎరువుల నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, ఆ భారం రైతులపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఎరువుల సబ్సిడీని 11 శాతం పెంచింది. పశ్చిమాసియాలో పరిస్థితులు త్వరగా చక్కబడకపోతే, మున్ముందు ఎరువుల దిగుమతి ఖర్చులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




