రౌడీయిజం చేసి మీ భూములను లాక్కున్నారా.? ఈ కోర్టు ఆర్డర్ తో చుక్కలు చూపించొచ్చు..
Injunction order: మీ సొంత స్థలాన్ని ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారా? ల్యాండ్ కబ్జాదారుల నుంచి మీ భూమిని కాపాడుకోవడానికి.
రౌడీయిజం చేసి మీ భూములను లాక్కున్నారా.? ఈ కోర్టు ఆర్డర్ తో చుక్కలు చూపించొచ్చు..
Injunction Order: భూమి అనేది ప్రతి సామాన్యుడికి ఒక కల, ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న ఒక జీవితకాలపు పెట్టుబడి. కానీ ఈ రోజుల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, కబ్జాదారుల కన్ను కూడా ఎప్పుడూ ఇలాంటి ఖాళీ స్థలాల మీదే ఉంటోంది. మనం ఎంతో కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకోవడానికి లేదా దౌర్జన్యంగా గుడిసెలు వేయడానికి ప్రయత్నిస్తుంటే మనకు ఎక్కడలేని భయం, ఆందోళన మొదలవుతాయి. ఇలాంటి ప్రాపర్టీ వివాదాలు, ల్యాండ్ కబ్జా కేసుల్లో బాధితులకు చట్టం కల్పించిన ఒక బ్రహ్మాస్త్రం లాంటి రక్షణ కవచమే 'ఇంజంక్షన్ ఆర్డర్'. అసలు ఈ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి? ఇది మన స్థలాన్ని ఎలా కాపాడుతుందో ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ చౌహాన్ వివరించారు.
ఇంజంక్షన్ ఆర్డర్(స్టే ఆర్డర్) అంటే ఏమిటి?
సాధారణ వాడుక భాషలో దీనిని మనం 'స్టే ఆర్డర్' అని కూడా పిలుస్తుంటాం. ఎవరైనా మీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి కబ్జా చేయాలని చూస్తున్నా, లేదా మీరు మీ స్థలంలో కట్టుకుంటున్న ప్రహరీ గోడను దౌర్జన్యంగా అడ్డుకుంటున్నా వెంటనే మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఆ భూమి మీ స్వాధీనంలో ఉన్నట్లుగా ఆధారాలు చూపించి కోర్టులో సివిల్ కేసు వేయాలి. మీ పత్రాలు, ఆధారాలు సక్రమంగా ఉంటే, ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని లేదా అవతలి వ్యక్తులు ఆ స్థలంలోకి అస్సలు ప్రవేశించకూడదని కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. దాన్నే చట్ట పరిభాషలో ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. ఈ ఆర్డర్ రావడం వల్ల, కోర్టులో మీ ఆస్తి వివాదం పూర్తిగా తేలే వరకు ఆ భూమిలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. యథాతథ స్థితి కొనసాగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి? ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
మీ ఖాళీ స్థలానికి, ప్లాట్‌కి లేదా వ్యవసాయ భూమికి కబ్జా ముప్పు ఉందనిపించిన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మంచి అనుభవం ఉన్న సివిల్ లాయర్‌ను సంప్రదించాలి. మీ పత్రాలు అన్నింటినీ కోర్టు ముందు ఉంచి, "నా ఆస్తికి తక్షణ రక్షణ కల్పించండి" అని తాత్కాలిక ఇంజంక్షన్ కోసం సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలి. ఒకసారి సివిల్ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ మీ చేతికి వచ్చిన తర్వాత దాని పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ ఆర్డర్‌ను ఏమాత్రం లెక్కచేయకుండా కబ్జాదారులు మీ స్థలంలోకి దౌర్జన్యంగా వస్తే, అది నేరుగా 'కోర్టు ధిక్కరణ' కిందకు వస్తుంది. అప్పుడు మీరు ఆ ఆర్డర్ కాపీని చూపించి వెంటనే స్థానిక పోలీసుల సహాయం తీసుకోవచ్చు. కోర్టు ఆర్డర్ ను ఉల్లంఘించిన వ్యక్తులపై పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు, అవసరమైతే వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపుతారు. కాబట్టి, మీ ఆస్తుల విషయంలో ఎప్పుడైనా ఇలాంటి ఊహించని ఇబ్బందులు తలెత్తితే దళారులు, రౌడీలకు భయపడి అనవసరంగా రాజీ పడకండి. మన దేశ చట్టం మీద పూర్తి నమ్మకంతో సరైన ఆధారాలతో సివిల్ కోర్టును ఆశ్రయిస్తే న్యాయం కచ్చితంగా మీ పక్షానే ఉంటుంది.




