Policybazaar: పాలసీ బజార్ షేర్లకు ఏమైంది..?
Policybazaar: ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధనల ఆందోళనలతో పాలసీ బజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ షేర్లు భారీగా పతనమయ్యాయి.
Policybazaar: పాలసీ బజార్ షేర్లకు ఏమైంది..?
PB Fintech shares: ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ దిగ్గజం పాలసీ బజార్ , పైసా బజార్ మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్‌టెక్ షేర్లు స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలతో కుదేలవుతున్నాయి. గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో ఈ కంపెనీ షేర్లలో అమ్మకాల సునామీ సృష్టించడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేరు విలువ ఏకంగా 48 నుంచి 49 శాతం వరకు పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
కొద్దికాలం కిందటి వరకు దూసుకెళ్లిన పీబీ ఫిన్‌టెక్ స్టాక్ ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూస్తోంది. గతేడాది డిసెంబరులో రూ. 1963 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు. అక్టోబర్ 1 నాటికి రూ. 965 వద్దకు పడిపోయి 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. ముఖ్యంగా సెప్టెంబర్ 24 ఒక్కరోజే ఈ స్టాక్ ఏకంగా 36 శాతం పతనమవడం విశేషం. ప్రస్తుతం 3 నెలల వ్యవధిలో 42 శాతం, ఆరు నెలల్లో 31 శాతం మేర నష్టపోయి ఇన్వెస్టర్ల సంపదనను ఆవిరి చేస్తోంది. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన కొత్త ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ నిబంధనలే.
ఐఆర్‌డీఏఐ తీసుకువస్తున్న కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ , సెగ్మెంటల్ కమిషన్ పరిమితులు, డార్క్ ప్యాటర్లపై కఠిన నిబంధనలు ఉన్నాయి. కస్టమర్లు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండానే ప్రొడక్ట్, ధర వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించడం, అలాగే పాలసీ డాక్యుమెంట్లలో కమిషన్ రేట్లను స్పష్టంగా వెల్లడించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
ముఖ్యంగా హెల్త్, మోటార్, టర్మ్ ఇన్సూరెన్స్‌లలో కమిషన్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉండటంతో... ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ల బిజినెస్ మోడల్‌పై తీవ్ర ప్రభావం పడుతుందన్న భయాలు మార్కెట్లో బలపడ్డాయి. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజీ సంస్థలు పీబీ ఫిన్‌టెక్ టార్గెట్ ధరలను భారీగా కుదించాయి.
బెర్న్‌స్టీన్: ఈ స్టాక్ టార్గెట్ ధరను ఏకంగా రూ. 2310 నుంచి రూ. 1085కి తగ్గించింది. అలాగే FY30 నికర లాభం అంచనాను రూ. 3200 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్లకు సవరించింది.
జెఫరీస్: టార్గెట్ ధరను రూ. 2050 నుంచి రూ. 1540కి తగ్గించినప్పటికీ, బై రేటింగ్‌ను మాత్రం కొనసాగించింది.
మోర్గాన్ స్టాన్లీ: ఈ నిబంధనల వల్ల కంపెనీ హెల్త్ బిజినెస్ వ్యాల్యూ ఏకంగా 60-70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.
HSBC & మోతీలాల్ ఓస్వాల్:హెచ్‌ఎస్‌బీసీ తన రేటింగ్‌ను హోల్డ్‌కు తగ్గించి టార్గెట్‌ను రూ. 1150కి కుదించగా, మోతీలాల్ ఓస్వాల్ కూడా రూ. 1150 టార్గెట్‌తో న్యూట్రల్ రేటింగ్‌ను కొనసాగించింది.
నియంత్రణ సంస్థల మారుతున్న నిబంధనలు డిజిటల్ ఇన్సూరెన్స్ దిగ్గజాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పీబీ ఫిన్‌టెక్ మేనేజ్‌మెంట్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.




