Petrol Price: కేంద్రం బిగ్ రిలీఫ్.. పెట్రోల్‌పై జీరో ట్యాక్స్.. నేటి నుంచే కొత్త ధరలు
Petrol Price: గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల మధ్య ఆయిల్ ఎగుమతిదారులకు ఈ తగ్గింపు మంచి ఊరటనిస్తుంది.
Petrol Price
Petrol Price: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పన్నుల వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్నును తగ్గిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నయా రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ఎగుమతిపై గతంలో లీటరుకు రూ. 3.50గా ఉన్న సుంకాన్ని ఏకంగా సున్నా చేసింది. ఈ నిర్ణయంతో దేశీయ చమురు శుద్ధి, ఎగుమతి సంస్థలకు భారీ ఉపశమనం లభించినట్లయింది.
డీజిల్, విమాన ఇంధనంపై తగ్గిన భారం
పెట్రోల్‌తో పాటు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతిదారులకు సైతం కేంద్రం ఊరటనిచ్చింది. డీజిల్ ఎగుమతులపై లీటరుకు ఉన్న రూ.25.50 పన్నును రూ.24కు తగ్గించింది. అంటే లీటరుకు రూ.1.50 చొప్పున పన్ను భారం తగ్గింది. విమానాల్లో వాడే ఏటీఎఫ్ (ATF) ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.22 నుంచి రూ.19.50కి కుదించింది. ఈ విభాగంలో లీటరుకు రూ.2.50 మేర ఊరట లభించింది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా వచ్చే అదనపు లాభాలపై నియంత్రణ సాధించేందుకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ పన్నులను సమీక్షిస్తుంటుంది.
సామాన్యుడి జేబుపై ప్రభావం ఎంత?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పన్ను తగ్గింపు నిర్ణయం వల్ల సాధారణ వాహనదారుల జేబుపై ఎలాంటి ప్రభావం పడదు. ఇది పూర్తిగా చమురును విదేశాలకు ఎగుమతి చేసే రిఫైనరీ కంపెనీలకు మాత్రమే పరిమితమయ్యే అంశం. దేశీయంగా బంకుల్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ నిర్ణయం వల్ల ఎటువంటి మార్పూ ఉండదు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే ముడిచమురు మార్పులను బట్టి మున్ముందు ఈ పన్నులను మరిన్ని సార్లు సవరించే అవకాశాలు ఉన్నాయి.
విండ్‌ఫాల్ ట్యాక్స్ కథాకమీషు
ఉక్రెయిన్ యుద్ధం వేళ అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోయిన సందర్భంలో, 2022 జులై నెలలో భారత్ తొలిసారిగా ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పరిస్థితులు సర్దుమణగడంతో రద్దు చేసినప్పటికీ, 2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కాస్త ఇరాన్‌కు వ్యాపించడంతో చమురు ధరలు మళ్లీ మండిపడ్డాయి. దీంతో పన్నును పునరుద్ధరించాల్సి వచ్చింది. గత సమీక్షలో ఆగస్టు 3న పన్నులను పెంచిన ప్రభుత్వం, అంతర్జాతీయ సరఫరా పరిస్థితులను బేరీజు వేసుకుని ఈసారి సుంకాలను తగ్గించడం విశేషం.




