స్టీరింగ్ లేని కాలంలో.. ప్రపంచపు తొలి కారు ఎలా నడిచేదో తెలుసా..?

Worlds First Car: మారుతున్న కాలంతో పాటు మోటారు వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

Venkat
Published on: 16 Aug 2026 9:25 PM IST
Worlds First Car
X

స్టీరింగ్ లేని కాలంలో.. ప్రపంచపు తొలి కారు ఎలా నడిచేదో తెలుసా..?

Worlds First Car: మారుతున్న కాలంతో పాటు మోటారు వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆధునిక కార్లలో ఆటోమేటిక్ గేర్లు, స్మార్ట్ స్టీరింగ్, ఏబీఎస్ లాంటి అధునాతన సాంకేతికతలు వాడుతున్నాం. కానీ, అసలు ఎలాంటి సదుపాయాలు లేని 140 ఏళ్ల క్రితం.. కనీసం స్టీరింగ్ చక్రం కూడా లేని ప్రపంచపు తొలి పెట్రోల్ కారును ఎలా నియంత్రించారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆసక్తికర కథనం మీకోసమే.

మూడు చక్రాలు.. వింత ఆకారం..

జర్మనీకి చెందిన ఇంజనీర్ కార్ల్ బెంజ్ 1885లో ప్రపంచంలోనే తొలి పెట్రోల్ కారును ఆవిష్కరించి ఆటోమొబైల్ రంగానికి పునాది వేశారు. ఈ కారుకు 'బెంజ్ పేటెంట్-మోటార్ వాగెన్' అని నామకరణం చేశారు. ఈ కారు ప్రస్తుత కాలపు మోడళ్లకు పూర్తి భిన్నంగా ఉండేది. సాధారణంగా కార్లకు నాలుగు చక్రాలు ఉంటే.. దీనికి మాత్రం ముందర ఒకటి, వెనుక రెండు చొప్పున కేవలం మూడు చక్రాలు మాత్రమే ఉండేవి. కారు మొత్తం బరువును మోసేందుకు అత్యంత తేలికపాటి ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. నాలుగు చక్రాలతో కారు తయారు చేస్తే దాని దిశను నియంత్రించే స్టీరింగ్ వ్యవస్థను నిర్మించడం అప్పట్లో అత్యంత కష్టమైన పని. అందుకే బెంజ్ మూడు చక్రాల డిజైన్‌ను ఎంచుకున్నారు.

స్టీరింగ్ లేకుండా దిశను ఎలా మార్చేవారు?

ఈ కారులో అత్యంత ఆసక్తికరమైన అంశం దీని స్టీరింగ్ సిస్టమ్. మనం ఇప్పుడు వాడుతున్న గుండ్రటి స్టీరింగ్ చక్రం ఈ కారుకు ఉండేది కాదు. దాని స్థానంలో 'టిల్లర్' (Tiller) అనే పొడవాటి ఇనుప హ్యాండిల్ లేదా లివర్‌ను అమర్చారు. ఈ టిల్లర్ నేరుగా ముందున్న సింగిల్ చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. డ్రైవర్ తన చేతితో ఆ పొడవాటి హ్యాండిల్‌ను ఎడమ వైపునకు తిప్పితే కారు ముందు చక్రం అటువైపు తిరిగి, కారు ఆ దిశలో ప్రయాణిస్తుంది. కుడివైపునకు తిప్పితే కుడివైపుకి వెళుతుంది. ప్రస్తుతం మనం ఎంతో సులువుగా తిప్పే స్టీరింగ్ స్థానంలో, అప్పట్లో ఈ లివర్ ద్వారానే కారును కంట్రోల్ చేసేవారు.

వేగం గంటకు 16 కిలోమీటర్లే!

ఈ కారు వెనుక భాగంలో చిన్న సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ ఉత్పత్తి చేసే పవర్‌ను బెల్ట్, చైన్ సాయంతో వెనుక చక్రాలకు సరఫరా చేసేవారు. ఈ ఇంజిన్ కేవలం 0.75 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తూ.. గరిష్టంగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించేది. ఇందులో నేటి కార్లలో ఉండే గేర్ బాక్స్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేదా కనీసం రివర్స్ గేర్ లాంటి సదుపాయాలు ఏవీ ఉండేవి కావు.

కార్ల యుగానికి సర్టిఫికెట్

కార్ల్ బెంజ్ తన ఆవిష్కరణకు గుర్తింపుగా జనవరి 29, 1886న జర్మన్ పేటెంట్ (DRP 37435) కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెర్సిడెస్-బెంజ్ రికార్డుల ప్రకారం ఇదే ప్రపంచపు తొలి ఆటోమొబైల్ జనన ధృవీకరణ పత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత 1888 నుంచి ఈ కార్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది.

నేటి కార్లతో పోలిస్తే నాటి 'బెంజ్ పేటెంట్-మోటార్ వాగెన్' ఒక చిన్న బొమ్మలా అనిపిస్తుంది. ఎలాంటి సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు లేకపోయినా.. గుర్రాలు లేదా జంతువుల అవసరం లేకుండా కేవలం ఇంధనంతో స్వయంగా నడిచే ఓ యంత్రాన్ని కనిపెట్టడం ఆ కాలంలో ఒక మహా అద్భుతం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story