UPI Payment: వేరే నెంబ‌ర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.? ఇలా చేస్తే డ‌బ్బు తిరిగి పొందొచ్చు

UPI Payment: ప్రస్తుతం చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు చాలా మంది UPI ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు.

Mokshith
Published on: 15 Aug 2026 12:58 PM IST
UPI Payment
X

UPI Payment: వేరే నెంబ‌ర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.? ఇలా చేస్తే డ‌బ్బు తిరిగి పొందొచ్చు

UPI Payment: ప్రస్తుతం చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు చాలా మంది UPI ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే తొందరలో ఒక అంకె తప్పుగా ఎంట‌ర్ చేయడం లేదా తప్పు వ్యక్తిని ఎంపిక చేయడం వల్ల డబ్బు వేరే ఖాతాలోకి వెళ్లే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి? డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా.?

తప్పు UPI చెల్లింపు జరిగితే వెంటనే ఏం చేయాలి?

మీరు పొరపాటున తప్పు వ్యక్తికి డబ్బు పంపితే ఆలస్యం చేయకుండా వెంటనే అల‌ర్ట్ అవ్వాలి. మీరు చెల్లింపు చేసిన UPI యాప్‌లో ట్రాన్సాక్షన్ వివరాలను తెరిచి UTR (యూనిక్ ట్రాన్సాక్ష‌న్ రిఫ‌రెన్స్‌) నంబర్, ట్రాన్సాక్షన్ తేదీ, పంపిన మొత్తం, ఎవరికి పంపారో వంటి వివరాలను నమోదు చేసుకోండి. ఇవి ఫిర్యాదు చేసేటప్పుడు అవసరం అవుతాయి.

UPI యాప్‌లో ఫిర్యాదు నమోదు చేయండి

డబ్బు పంపిన యాప్‌లోని హెల్ప్ లేదా రైజ్ ఏ కంప్లైట్ ఆప్షన్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయండి. ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందించి, పొరపాటున చెల్లింపు జరిగిందని తెలియజేయండి. చాలా యూపీఐ యాప్‌లు ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించే సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

బ్యాంకును వెంటనే సంప్రదించండి

యాప్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి లేదా సమీప బ్రాంచ్‌ను సంప్రదించండి. UTR నంబర్‌తో పాటు ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను బ్యాంకుకు ఇవ్వండి. అవసరమైతే బ్యాంక్, డబ్బు వెళ్లిన బ్యాంకుతో సంప్రదించి రికవరీ ప్రక్రియను ప్రారంభిస్తుంది.

NPCI ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం

UPI వ్యవస్థను నిర్వహించే NPCI (నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా) కూడా వినియోగదారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. UPI లావాదేవీలకు సంబంధించిన సమస్యలను NPCI డిస్‌ప్యూట్ మెకానిజం ద్వారా నమోదు చేసి పరిష్కారం కోరవచ్చు. దీంతో మీ ఫిర్యాదు అధికారికంగా నమోదు అవుతుంది.

డబ్బు తిరిగి వస్తుందా?

UPI ద్వారా ఒకసారి ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తయితే దాన్ని వెంటనే రద్దు చేసే అవకాశం ఉండదు. అయితే మీరు చేసిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత బ్యాంకులు చర్యలు తీసుకుంటాయి. డబ్బు వెళ్లిన వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరిస్తేనే రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి ఇవ్వకపోతే ప్రక్రియ కొంత సమయం తీసుకోవచ్చు. అందుకే UPI చెల్లింపు చేసే ముందు పేరు, మొబైల్ నంబర్ లేదా UPI IDని రెండుసార్లు చెక్ చేయడం అత్యంత ముఖ్యం.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story