Renigunta: ఇల్లు వదిలి వెళ్లిన 10 ఏళ్ల బాలుడు పోలీసుల సాయంతో సురక్షితంగా ఇంటికి

Renigunta: చదువుకోమని తల్లిదండ్రులు మందలించడంతో ఇల్లు వదిలి వెళ్లిన 10 ఏళ్ల బాలుడు తిరుపతిలో సురక్షితం. ఆటోడ్రైవర్ రామచంద్ర అప్రమత్తత, రేణిగుంట పోలీసుల సాయం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Aug 2026 11:23 AM IST
Renigunta
X

Renigunta: ఇల్లు వదిలి వెళ్లిన 10 ఏళ్ల బాలుడు పోలీసుల సాయంతో సురక్షితంగా ఇంటికి

Renigunta: చదువులో సరిగ్గా రాణించడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 10 ఏళ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. అయితే ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని ఓ ఆటోడ్రైవర్ గుర్తించి పోలీసులకు అప్పగించడంతో బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు.

తిరుపతికి చెందిన ధనుష్ (10) జీవకోనలోని శ్రీ సదీశ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. చదువులో సరిగ్గా శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో కోపానికి గురైన బాలుడు శనివారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చాడు.

ఈ క్రమంలో మంగళం రోడ్డులో బాలుడు ఒంటరిగా తిరుగుతుండటాన్ని తారకరామ నగర్‌కు చెందిన రామచంద్ర అనే ఆటోడ్రైవర్ గమనించాడు. బాలుడి పరిస్థితిని గమనించిన రామచంద్ర వెంటనే అతడిని రేణిగుంట పోలీసుల వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు.

బాలుడి నుంచి వివరాలు తెలుసుకున్న రేణిగుంట పోలీసులు అతని తల్లిదండ్రులు ఎనుగుల శ్రీనివాసులు, రెడ్డెమ్మలకు, అలాగే పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. బాలుడిని గుర్తించి పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్ రామచంద్రకు, బాలుడిని సురక్షితంగా తమకు అప్పగించిన రేణిగుంట పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

బాలుడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం అందించిన ఆటోడ్రైవర్ రామచంద్రను స్థానికులు అభినందించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story