Ramasamudram: పుంగనూరు రామసముద్రం మండలాల్లో ఎస్టీ కమిషన్ విస్తృత పర్యటన

Ramasamudram:

MAHESH, PUNGANOOR
Published on: 15 July 2026 10:52 PM IST
Ramasamudram
X

Ramasamudram: పుంగనూరు రామసముద్రం మండలాల్లో ఎస్టీ కమిషన్ విస్తృత పర్యటన

రామసముద్రం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి వందశాతం చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప ఆదేశించారు.

బుధవారం అన్నమయ్య జిల్లా పుంగనూరు, రామసముద్రం మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన గిరిజన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. గిరిజనులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

రామసముద్రం మండలం పెద్దకూరపల్లి గ్రామంలో హౌసింగ్, తాగునీరు, ఆరోగ్యం, అంగన్‌వాడీ, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. గ్రామంలో కొన్ని గిరిజన కుటుంబాలకు ఇప్పటికీ ఆధార్ కార్డులు లేకపోవడం, శ్మశానవాటిక సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలను గ్రామస్థులు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని అత్యవసరంగా పరిష్కరించి అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం రామసముద్రం మండలం గొల్లపల్లి గ్రామంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, గిరిజనులతో కలిసి ఏకలవ్య మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం పుంగనూరు మండలం కుమ్మరగుంట ఎస్టీ కాలనీలో మండల స్థాయి అధికారులతో సమావేశమై గిరిజనుల సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు.

పుంగనూరులోని జడ్పీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వాటిని సకాలంలో పరిష్కరించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు గతంలో ఆధార్ కార్డులు, గృహ వసతి, ఇతర ప్రభుత్వ సేవలు పొందడంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందన్నారు. ముఖ్యంగా రామసముద్రం మండలం గోసువారిపల్లి గ్రామంలోని కొన్ని గిరిజన కుటుంబాలకు ఇళ్లు, ఆధార్ కార్డులు లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సంబంధిత అధికారులు గ్రామాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, ఇళ్లులేని కుటుంబాలు, ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులు, ఇతర సమస్యలను సమగ్రంగా గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అసైన్డ్ భూముల ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, శ్మశానవాటికలు, తాగునీరు, విద్యుత్, రహదారులు, గృహ వసతి వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. జిల్లాలోని గిరిజనవాడలు, యానాది, ఎరుకల తదితర గిరిజన ఆవాసాలను అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

గిరిజనుల అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని పేర్కొంటూ, ప్రతి కుటుంబం తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమవుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలని సూచించారు. స్థానిక స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, విధానపరమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, పుంగనూరు తహసీల్దార్ రాము, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, మేడా రామకృష్ణ, మునికృష్ణ, బి. కోట బాలు,

ఎస్టీ ట్రైబల్ నేషనల్ ప్రెసిడెంట్ అక్కులప్ప నాయక్, గిరిజన సంఘాల నాయకులు సాకే వీరాంజనేయులు, శ్రీనివాస్ వర్మ,కుప్పం జగన్, ఎం. బాబు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story