Chittoor: ఏడాదిలో సరికొత్త చిత్తూరు ఊపందుకున్న రోడ్లు, డ్రైనేజీ పనులు!
Chittoor: మరో ఏడాదిలో చిత్తూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రూ.38 కోట్లతో హైరోడ్ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన.
Chittoor: ఏడాదిలో సరికొత్త చిత్తూరు ఊపందుకున్న రోడ్లు, డ్రైనేజీ పనులు!
Chittoor: మరో ఏడాదిలోగా అభివృద్ధి చెందిన కొత్త చిత్తూరు నగరాన్ని ప్రజలు చూడబోతున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా చిత్తూరు నగరం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రస్తుతం సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
నగర అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, కన్నన్ పాఠశాలలో సుమారు రూ.1 కోట్ల వ్యయంతో 200 మంది విద్యార్థులకు ఉపయోగపడే నూతన వసతి గృహాన్ని నిర్మించినట్లు తెలిపారు.
అలాగే ప్రశాంత్ నగర్, మురకంబట్టులో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులను పూర్తి చేశామని, త్వరలోనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే జగన్మోహన్, మున్సిపల్ అధికారుల కృషి, ప్రజల సహకారంతో రోడ్ల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని, వీటి ద్వారా నగరంలోని ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
రూ.38 కోట్ల వ్యయంతో హైరోడ్ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని, 12 నెలల్లో ప్రధాన పనులు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు.
గాంధీ సర్కిల్ నుంచి బ్రిడ్జి, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, రిలయన్స్ మీదుగా పుత్తూరు రోడ్డు వరకు బీటీ రహదారి నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
అదేవిధంగా చిత్తూరు సమీపంలో త్వరలో రెండు బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని, దీంతో నగర అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.




