Nagari: మున్సిపల్ కౌంటింగ్‌కు 1,384 మంది పోలీసులతో పటిష్ట భద్రత
Nagari: చిత్తూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 1,384 మంది పోలీసులతో మూడంచెల భద్రత. ఎస్పీ తుషార్ డూడి ప్రకటన, 144 సెక్షన్ అమలు.
Nagari: మున్సిపల్ కౌంటింగ్‌కు 1,384 మంది పోలీసులతో పటిష్ట భద్రత
నగరి: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఒక ప్రకటనలో తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాలు:
1. చిత్తూరు – పీవీకేఎన్ కళాశాల.
2. కుప్పం – డిగ్రీ కళాశాల.
3. పలమనేరు – వృత్తి విద్యా కళాశాల.
4. నగరి – సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల.
ఓట్ల లెక్కింపు బందోబస్తు విధుల కోసం మొత్తం 1,384 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ తెలిపారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి రిటర్నింగ్ అధికారి (RO) అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే ఏజెంట్లు మొబైల్ ఫోన్లను కేంద్రంలోకి తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రచార కార్యక్రమాలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. అదేవిధంగా 100 మీటర్ల పరిధిలోని నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని ఎస్పీ తెలిపారు.
ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించి శాంతిభద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.




