Satyavedu: శ్రీసిటీలో ఘనంగా సీఐఐ (CII) రాష్ట్ర కౌన్సిల్ రెండో సమావేశం
Satyavedu: సీఐఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి. కుటుంబరావు, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ప్రసంగించారు.
Satyavedu: శ్రీసిటీలో ఘనంగా సీఐఐ (CII) రాష్ట్ర కౌన్సిల్ రెండో సమావేశం
Satyavedu: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ రెండో సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల సుస్థిరత, మార్కెట్ అవకాశాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై పారిశ్రామికవేత్తలు చర్చించారు.
స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి. కుటుంబరావు ముఖ్య అతిథిగా పాల్గొని “భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పరిశ్రమలపై చూపుతున్న ప్రభావం – వాటిని ఎదుర్కొనే వ్యూహాలు” అనే అంశంపై ప్రసంగించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలు వినూత్నత, అనుకూలత, ముందుచూపుతో కూడిన వ్యూహాలను అవలంబించాలని సూచించారు.
దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, సరఫరా గొలుసు వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని కుటుంబరావు పేర్కొన్నారు. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక క్లస్టర్‌గా శ్రీసిటీని అభివర్ణిస్తూ, ఎల్‌జీ, డైకిన్, క్యారియర్ వంటి అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి సరఫరా సంస్థల అభివృద్ధికి శ్రీసిటీ పారిశ్రామిక అనుకూల వాతావరణం దోహదపడిందన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) చీఫ్ మేనేజర్ సెంథిల్ మురుగన్ ఎస్‌ఎంఈ ఐపీఓలు, స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా సంస్థలు మూలధన మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించి వేగంగా అభివృద్ధి చెందవచ్చని వివరించారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో, సీఐఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా సుస్థిర అభివృద్ధిలో శ్రీసిటీ పాత్ర ప్రతిబింబిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో కూడా శ్రీసిటీ పారిశ్రామికవేత్తలు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక బాధ్యత కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. సమగ్ర అభివృద్ధి, సమాజ సాధికారతే శ్రీసిటీ లక్ష్యమని పేర్కొన్నారు.
సమావేశంలో స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్ డైరెక్టర్ సాంబశివరాజు, సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎస్.నరేంద్ర కుమార్ శరణం, వైస్ చైర్మన్ డాక్టర్ జి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి ముందు కుటుంబరావు మరియు సీఐఐ ప్రతినిధులు శ్రీసిటీ మౌలిక సదుపాయాలను పరిశీలించారు. డైకిన్, హంటర్ డగ్లస్, రాక్‌వర్త్ తయారీ యూనిట్లను సందర్శించి ఆధునిక ఉత్పత్తి విధానాలను అవగాహన చేసుకున్నారు.




