బ్రతికే ఉన్న మహిళను చంపేసిన రికార్డులు.. కలెక్టరేట్‌లో మూగ మహిళ గోడు
Madanapalle: బ్రతికే ఉన్న షర్మిల అనే మూగ, చెవిటి మహిళను రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మృతురాలిగా నమోదు చేయడంతో ఆమెకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాయి.
బ్రతికే ఉన్న మహిళను చంపేసిన రికార్డులు.. కలెక్టరేట్‌లో మూగ మహిళ గోడు
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ లేఅవుట్‌కు చెందిన షర్మిల అనే మహిళను రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మృతురాలిగా నమోదు చేయడంతో ఆమెకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు గత ఏడాది కాలంగా నిలిచిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన షర్మిలకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే గత కొంతకాలంగా ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడంతో సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగి ఆరా తీసింది. ఈ క్రమంలో రేషన్ కార్డులో ఆమెను చనిపోయినట్లుగా నమోదు చేసినట్లు రేషన్ దుకాణ నిర్వాహకుల ద్వారా తెలిసింది. తాను సజీవంగానే ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పథకాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల, సైగల ద్వారా తన గోడును వెల్లడిస్తూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించింది.
తన వివరాలను సరిచేసి న్యాయం చేయాలని కోరింది. ఈ సందర్భంగా ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి ఆమెకు అండగా నిలిచి, వెంటనే రికార్డులను సవరించి బాధిత మహిళకు అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని అధికారులను కోరారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేశారు.




