విచారణకు వచ్చి పోలీసులపైనే దాడి.. ఢిల్లీలో కలకలం.!
Delhi Police Attack: సెంట్రల్ ఢిల్లీలోని జామా మసీదు పోలీస్ స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది.
విచారణకు వచ్చి పోలీసులపైనే దాడి.. ఢిల్లీలో కలకలం.!
Delhi Police Attack: సెంట్రల్ ఢిల్లీలోని జామా మసీదు పోలీస్ స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. విచారణ కోసం పిలిచిన 25 ఏళ్ల యువకుడు కత్తితో ఐదుగురు పోలీసు సిబ్బందిపై దాడి చేసి, దొంగిలించిన బైక్‌పై పరారయ్యాడు. కొద్దిసేపటికే సమీప ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి రెండు కాళ్లకు బుల్లెట్లు తగలడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణ సమయంలో అకస్మాత్తుగా దాడి
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదంలో వేధిస్తున్నాడంటూ తల్లి, సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నబీల్ అనే యువకుడిని పోలీసులు విచారణ కోసం స్టేషన్‌కు పిలిచారు. స్టేషన్‌లో సిబ్బంది అతనితో మాట్లాడుతున్న సమయంలో నబీల్ ఒక్కసారిగా కత్తి తీసి వారిపై దూసుకెళ్లాడు. ముఖం, మెడ భాగాలను లక్ష్యంగా చేసుకుని ఐదుగురు సిబ్బందిని కత్తితో పొడిచి బయటకు పారిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి నుంచి బైక్ లాక్కుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ముగ్గురు సిబ్బంది పరిస్థితి విషమం
దాడిలో గాయపడిన పోలీసులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రికి మార్చామని అధికారులు తెలిపారు. మిగిలిన ఇద్దరు సిబ్బంది స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిట్లీ ఖబర్‌లో పట్టుకున్న పోలీసులు
నబీల్ పారిపోయిన వెంటనే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆపరేషన్స్ యూనిట్ బృందం గాలింపు మొదలుపెట్టింది. స్థానిక సమాచారం, సాంకేతిక ఆధారాలతో తక్కువ సమయంలోనే సమీపంలోని చిట్లీ ఖబర్ ప్రాంతంలో అతని జాడ కనిపెట్టింది. అరెస్ట్ చేసేందుకు పోలీసులు చుట్టుముట్టగా, నబీల్ మళ్లీ హింసాత్మకంగా ప్రవర్తిస్తూ సిబ్బందిపై దాడికి యత్నించాడు. ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. రెండు కాళ్లకు బుల్లెట్లు తగిలి కుప్పకూలిన నబీల్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.




