Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగు విద్యుదాఘాత మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి!
Chittoor: చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగు విద్యుదాఘాత మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి!
చిత్తూరు: చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాపిరెడ్డిగారిపల్లె సమీపంలోని ఓ మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్ తీగ తక్కువ ఎత్తులో ఉండటంతో.. అటవీ ప్రాంతం నుంచి సంచరిస్తూ వచ్చిన ఏనుగు ప్రమాదవశాత్తు ఆ తీగను తాకినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఏనుగు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వివరించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదికను సమర్పించాలని పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, విద్యుత్ తీగల ఏర్పాటు, సంబంధిత నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మృతి చెందిన ఏనుగుకు వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు ఏనుగును ఖననం చేయాలని సూచించారు. పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షిస్తూ, సంబంధిత వివరాలను అధికారికంగా నమోదు చేయాలని తెలిపారు.
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ భూములు, మామిడి తోటలు, బోర్‌వెల్ మోటార్లకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ల విషయంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు.
వన్యప్రాణులు సంచరించే మార్గాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటవీ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి సరిచేయాలని సూచించారు.
ఏనుగుల సంచార ప్రాంతాల్లో ముందస్తు ప్రమాద నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వన్యప్రాణుల రక్షణతో పాటు స్థానిక రైతులు, ప్రజల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.




