Chinnamandem: చిన్నర్సుపల్లెలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ!
Chinnamandem: చిన్నర్సుపల్లెలో జరిగిన శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దేవనాధ రెడ్డి పాల్గొన్నారు.
Chinnamandem: చిన్నర్సుపల్లెలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ!
Chinnamandem: చిన్నమండెం మండలం చిన్నర్సుపల్లె గ్రామంలో నిర్వహించిన శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలకు విచ్చేసిన నాయకులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి, వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలను వారి చేత నిర్వహింపజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించి, దుస్సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, విజయవంతమైన జీవితం కోసం ప్రతి మనిషి ధర్మమార్గంలో పయనించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మ పరిరక్షణ, న్యాయం, ప్రేమ, సేవ, నాయకత్వం వంటి శాశ్వత విలువలకు శ్రీకృష్ణ పరమాత్మ జీవితం చిరస్మరణీయ ఆదర్శమని పేర్కొన్నారు.
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత... అనే భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, ధర్మం క్షీణించిన ప్రతిసారి లోకక్షేమం కోసం అవతరించి మానవాళికి సన్మార్గాన్ని చూపిన దైవ స్వరూపమే శ్రీకృష్ణుడని అన్నారు. శ్రీకృష్ణుడు కేవలం ఆరాధ్య దైవమే కాకుండా గొప్ప తత్త్వవేత్త, సమర్థ నాయకుడు, ధైర్యవంతుడైన యోధుడు, నిజమైన మిత్రుడు, విశ్వమానవతకు మార్గదర్శకుడిగా యుగయుగాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. ప్రేమ, స్నేహం, ధర్మం, శాంతి, సహనం, నాయకత్వం, ప్రకృతి పరిరక్షణ వంటి శాశ్వత విలువల సమాహారమే శ్రీకృష్ణ తత్వమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఆ విలువలను ఆచరణలో పెట్టి సమాజంలో సామరస్యం, సోదరభావం పెంపొందించాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్తులు, దాతలు, భక్తులు సమిష్టి సహకారంతో శ్రీకృష్ణుడి ఆలయాన్ని సుందరంగా నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి, సామాజిక ఐక్యతకు ప్రతీకలని పేర్కొంటూ, శ్రీకృష్ణుడి కృప ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




