Chittoor: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: వీకోట రౌండ్ టేబుల్ సమావేశం!
Chittoor: ఆంధ్రప్రదేశ్‌లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చిత్తూరు జిల్లా వీకోటలో నిర్వహించిన 7వ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు.
Chittoor: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి: వీకోట రౌండ్ టేబుల్ సమావేశం!
చిత్తూరు జిల్లా వి కోట: రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితా లో చేర్చాలని రాష్ట్ర రజక ఎస్సీ సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన వీకోట లో ఆదివారం ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ కార్యదర్శి సోమశేఖర్ అధ్యక్షతన ఏడవ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఏపీ స్టేట్ రజక ఎస్సీ సాధన కమిటీ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రజకుల చిరకాల వాంఛ తమను ఎస్సీల్లో చేర్చాలన్న డిమాండ్ కు కట్టుబడి జాతి ఐక్యతకు కట్టుబడి సాధించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు జిల్లా మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముఖం మాట్లాడుతూ... రజకులను దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీగా, 2 రాష్ట్రాల్లో ఎస్టీలుగా గుర్తించారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ బీసీ-ఏ కేటగిరీలోనే ఉందన్నారు. 2014 టీడీపీ మేనిఫెస్టోలో రజక కులాన్ని ఎస్సీ గా గుర్తించడానికి కమిటీ వేస్తామని, ప్రభుత్వం దిగిపోయే సమయంలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు.
ప్రభుత్వం మారడంతో తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఈ అంశాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకొని రజకులకు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా నిర్ణయం తీసుకొని, రజక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానించి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేసారు. రజక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజక కార్పొరేషన్ కు తగినంత బడ్జెట్, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించి, వృత్తిదారులకు ఆర్థిక సహాయం, గృహ వసతి కల్పించాలన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ వస్తేనే మా పిల్లలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు లభిస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఏడవ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు . విద్యావంతులు, మేధావులు, కుల సంఘ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మాన కాపీని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో లా కాలేజ్ ప్రొఫెసర్ నారాయణ, మల్లల నాగరాజ్, మోహన్, చిన్నస్వామి తోపాటు వీకోట గంగాభవాని రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.




