Madanapalle: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి!
Madanapalle: మదనపల్లెలో ఓటు చోరీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలు.
Madanapalle: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి!
Madanapalle: ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ గురువారం మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లా బకస్, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, సీపీఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, ఆప్ నాయకులు రహీం భాష మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారనే ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైనారిటీలు, దళితులు, క్రైస్తవుల ఓట్లను తొలగించేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులు, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో నిరసనలను అణచివేసే చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
గతంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల విధానంపై ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల కమిషన్ వ్యవహారాలపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వారు కోరారు. అలాగే ఎన్నికల ప్రక్రియపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలపై కూడా ప్రజల్లోకి వచ్చి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇండియా బ్లాక్ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సాంబశివ మురళి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి, ముబారక్ ఖాన్, ఖాదర్ బాషా, మీనా కుమారి, రవీంద్ర, ఈశ్వరయ్య, ఇలాహి, నాగరాజు, మహబూబ్ పీర్, నరసింహ నాయక్, రాజశేఖర్ నాయక్, మహమ్మద్ అలీ, పాలేటి, చాంద్ భాష, మస్తాన్, జీవన్, హరి తదితరులు పాల్గొన్నారు.




