Madanapalle: మదనపల్లెలో కొణిదెల ఛారిటబుల్ ట్రస్ట్ ఘనంగా అన్నదానం!
Madanapalle: జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లెలో కొణిదెల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం మరియు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
Madanapalle: మదనపల్లెలో కొణిదెల ఛారిటబుల్ ట్రస్ట్ ఘనంగా అన్నదానం!
మదనపల్లె: ఎన్నారై కొణిదెల లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం మదనపల్లె పట్టణంలో కొణిదెల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు కొణిదెల నారాయణస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, చిత్తూరు బస్టాండ్, మిమ్మనపల్లి సర్కిల్ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి వందలాది మంది నిరుపేదలు, ప్రయాణికులకు భోజనాలు అందజేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ బుచ్చిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని, ప్రతి వాహనదారుడు నాణ్యమైన హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.
ట్రస్ట్ వ్యవస్థాపకుడు కొణిదెల నారాయణస్వామి మాట్లాడుతూ, సమాజ సేవే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, వైద్యం, పేదల సంక్షేమంతో పాటు రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని, కొణిదెల లోకేష్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాజేష్, నిరంజన్ నాని, సీఐలు రాజారెడ్డి, రఫీ, ట్రాఫిక్ ఎస్‌ఐ గాయత్రి, పోలీసు సిబ్బంది, కొణిదెల అభిమానులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




