Madanapalle: భూమి ఆశచూపి మోసం: నకిలీ పాసుపుస్తకాల ముఠా అరెస్ట్!

Madanapalle: రూ.5 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే ఇప్పిస్తామని నకిలీ పాసుపుస్తకాలతో రూ.14 లక్షలు మోసం చేసిన ఐదుగురిని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 1 Aug 2026 8:15 PM IST
Madanapalle
X

Madanapalle: భూమి ఆశచూపి మోసం: నకిలీ పాసుపుస్తకాల ముఠా అరెస్ట్!

మదనపల్లె, ఆగస్టు 1: తక్కువ ధరకే కోట్ల విలువైన భూమి ఇప్పిస్తామని నమ్మించి, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి రూ.14 లక్షలు మోసం చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు.

శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. కదిరి–పలమనేరు జాతీయ రహదారి సమీపంలోని బసినికొండ పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు రూ.5 కోట్ల విలువైన 2.52 ఎకరాల భూమిని కేవలం రూ.13 లక్షలకే విక్రయిస్తామని చెప్పి బాధితులను నమ్మించారని తెలిపారు.

భూమి చూపించి, కొలతలు వేయించి ముందస్తు ఒప్పందం రాసి రూ.13 లక్షలు తీసుకున్న అనంతరం, పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పిస్తామని మరో రూ.1 లక్ష వసూలు చేసి, తహసీల్దార్ సంతకం ఉన్నట్లుగా నకిలీ పాసుపుస్తకాలు తయారు చేసి అందజేశారని వివరించారు. తర్వాత ఆ పత్రాలు నకిలీవని, అదే భూమిని ఇప్పటికే ఇతరులకు విక్రయించిన విషయం బాధితులకు తెలిసింది.

డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు జూలై 29న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ ఎం. బుచ్చిరాజు పర్యవేక్షణలో తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో నిమ్మనపల్లె నాలుగు రోడ్ల కూడలి వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. భూములు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలని, తక్కువ ధరకే విలువైన భూములు ఇప్పిస్తామనే ఆశచూపే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, డీఎస్పీ ఎం. బుచ్చిరాజు, తాలూకా సీఐ కళా వెంకటరమణతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story