Madanapalle: రాజ్యాంగంపై కుట్రలు సహించం మోదీ, షాపై చింతామోహన్ ఫైర్

Madanapalle: మదనపల్లెలో ప్రధాని మోదీ, అమిత్‌షా, చంద్రబాబుపై చింతామోహన్ విమర్శలు; విదేశీ అప్పులు, నిధుల వినియోగంపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.

Srinivasulu, Madanapalle
Published on: 27 Nov 2026 7:35 PM IST
Madanapalle
X

Madanapalle: రాజ్యాంగంపై కుట్రలు సహించం మోదీ, షాపై చింతామోహన్ ఫైర్

మదనపల్లె: మదనపల్లె ఇందిరానగర్ దొంతివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా అన్నమయ్య జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్. రెడ్డి సాహెబ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ సవరణ ప్రయత్నాలపై చంద్రబాబు నాయుడుకు కడప నుంచి హెచ్చరిక చేస్తున్నామని అన్నారు. చంద్రబాబును ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎదిగేలా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్‌లో ఎదిగిన ఆయన నేడు బీజేపీకి తొత్తుగా మారారని విమర్శించారు.

ప్రధాని మోదీ, అమిత్‌షాలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. బియ్యం, పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెట్టడం దారుణమన్నారు. రైతులు, పేదలకు బ్యాంకు రుణాలు అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

కార్పొరేట్ సంస్థలకు రూ.16.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించిన ఆయన, మోదీ 12 ఏళ్ల పాలనలో రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులు చేశారని పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో అప్పులు తీసుకొచ్చి ఏం చేశారో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ అప్పుల వివరాలు, వాటి వినియోగంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle