Madanapalle: మదనపల్లె హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. నోటీసులు జారీ!
Madanapalle: మదనపల్లె హోటళ్లలో ఆహార భద్రతాధికారి హరిత ఆకస్మిక తనిఖీలు. పరిశుభ్రత లోపాలు, కల్తీ నూనెల వాడకంపై హెచ్చరికలు, నోటీసులు మరియు జరిమానాలు.
Madanapalle: మదనపల్లె హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. నోటీసులు జారీ!
మదనపల్లె: మదనపల్లెలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, వంట నూనెను పదేపదే వినియోగించడం, ప్రిజర్వేటివ్లతో కూడిన ఆహార పదార్థాల వినియోగం ద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందంటూ బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ జిల్లా ఆహార భద్రతాధికారి హరితకు పది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఆహార భద్రతాధికారి హరిత ఆధ్వర్యంలో సోమవారం పునీత్ కుమార్ సమక్షంలో మదనపల్లెలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కొన్ని హోటళ్లలో వంట నూనెను పదేపదే వినియోగించడం, ప్రిజర్వేటివ్ల వాడకం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం.
వంటశాలలు అపరిశుభ్రంగా నిర్వహించడం వంటి పలు ఉల్లంఘనలు గుర్తించారు.నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్ల యాజమాన్యాలకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానాలు విధించారు. ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదుపై వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించిన జిల్లా ఆహార భద్రతాధికారి హరితతో పాటు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు ఒకరోజుతో పరిమితం కాకుండా తరచూ నిర్వహించాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలాంటి రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.




