Madanapalle: మదనపల్లె విజయభారతి స్కూల్లో కెరీర్ గైడెన్స్ సదస్సు
Madanapalle: మదనపల్లె విజయభారతి పాఠశాలలో “కెరీర్ గైడెన్స్ వర్క్‌షాప్ అండ్ లైవ్ పర్ఫార్మెన్స్” కార్యక్రమం.
Madanapalle: మదనపల్లె విజయభారతి స్కూల్లో కెరీర్ గైడెన్స్ సదస్సు
Madanapalle: విద్యార్థులు విద్య, క్రీడలతో పాటు సంగీత రంగంలోనూ రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. మదనపల్లె పట్టణంలోని విజయభారతి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన "కెరీర్ గైడెన్స్ వర్క్‌షాప్ అండ్ లైవ్ పర్ఫార్మెన్స్" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫ్లూటిస్టులు అర్జున్ ఎంపియన్, ఎదునందన్ నాగరాజు హాజరయ్యారు.
వారికి పాఠశాల అధినేత డాక్టర్ సేతు, ప్రిన్సిపల్ నిశ్చిత సేతు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా అతిథులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి విద్యార్థులు విద్య పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్, వ్యాపారం, క్రీడలు వంటి రంగాలను కెరీర్‌గా ఎంచుకుంటున్నారని, సంగీత రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
పిల్లలలోని ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. విద్య, క్రీడలతో పాటు సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న విద్యాసంస్థగా విజయభారతి ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రశంసించారు. డాక్టర్ సేతు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన కళాకారులు విద్యార్థుల కోసం ఉచితంగా కార్యక్రమం నిర్వహించేందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
డాక్టర్ అజంతుల్లా ఖాన్ మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లాకు సంగీత సంప్రదాయం గొప్పదని, అన్నమయ్య కీర్తనల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. విద్యతో పాటు సంగీతాన్ని అభ్యసిస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బహుజన సేన నాయకులు శ్రీచందు మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు, సంగీతం, నృత్యం వంటి రంగాలను ప్రోత్సహించడం విజయభారతి ప్రత్యేకత అని అన్నారు. ప్రతి విద్యార్థి తన జీవితంలో ఒక కళను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




