Madanapalle: నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్!

Madanapalle: బంగారు దండలు దొరికాయంటూ నకిలీ బంగారాన్ని చూపించి అమాయక ప్రజలను మోసం చేసి, కత్తులతో బెదిరించి నగదు దోచుకుంటున్న ముఠా.

Srinivasulu, Madanapalle
Published on: 19 Jun 2026 5:49 PM IST
Madanapalle
X

Madanapalle: నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్!

Madanapalle: నకిలీ బంగారు పూసల దండను అసలు బంగారంగా చూపించి అమాయక ప్రజలను మోసం చేసి నగదు దోచుకుంటున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లి II టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ పావని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 కిలోల 800 గ్రాముల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, ఒక టయోటా ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

డీఎస్పీ వివరాల ప్రకారం, నిందితులు భూమిలో జేసీబీ పనుల సమయంలో బంగారం దొరికిందని నమ్మబలికి, తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను ఆకర్షించేవారు. ఈ క్రమంలో బాధితులను మదనపల్లికి రప్పించి, నకిలీ బంగారు దండను అసలు బంగారంగా చూపించారు. అనంతరం హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై మదనపల్లి II టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.131/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నిర్వహించిన వాహన తనిఖీల్లో టయోటా ఇన్నోవా కారుతో ప్రయాణిస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.

నిందితుల వద్ద నుంచి 2.8 కిలోల నకిలీ బంగారు పూసల దండ, మూడు కత్తులు, టయోటా ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ముఠాపై గతంలో కూడా రెండు కేసులు నమోదైనట్లు విచారణలో తేలిందని, కేసులో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

నకిలీ బంగారం పేరుతో తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ పావని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇలాంటి మోసాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story