Palamaner: ఆరు నెలల్లో పలమనేరు రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

Palamaner: రూ.120 కోట్లతో ఆరు నెలల్లో పలమనేరు మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని, తాగునీరు, డ్రైనేజీలకు ప్రాధాన్యమిస్తామని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి తెలిపారు.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 11 Sept 2026 3:19 PM IST
Palamaner
X

Palamaner: ఆరు నెలల్లో పలమనేరు రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

చిత్తూరు జిల్లా: ఆరు నెలల వ్యవధిలో రోడ్లు, డ్రైనేజీలు, పైప్‌లైన్లు, లైట్లు వంటి అన్ని మౌలిక వసతుల పనులను పూర్తి చేసి మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బొమ్మిదొడ్డి, నీలకుంట, శ్రీనగర్ కాలనీ, విద్యానగర్ కాలనీ, గుడియాత్తం రోడ్డు, గడ్డురు , బోరెడ్డిపల్లి కాలనీ, పోలీస్ లైన్, టీఎస్ అగ్రహారం, లక్ష్మీ నగర్ ప్రాంతాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం పర్యటించారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు మరియు ప్రారంభోత్సవాలు చేపట్టారు. అనంతరం బోరెడ్డిపల్లి కాలనీవాసులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మున్సిపాలిటీలో సుమారు 120 కోట్లతో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

బోరెడ్డిపల్లి కాలనీలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు, DMF, BPS/LRS, టౌన్ ప్లానింగ్, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద దాదాపు ₹2.6 కోట్లు ఒకే విడతగా మంజూరు చేశామన్నారు .

గతంలో 2018లోనే మంత్రిగా ఉన్న సమయంలో "CIPP" (క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్) కింద ₹50 కోట్లు మంజూరు చేసినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పనులు చేయకుండా నిలిపివేసిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించామని, ఈ నెల 26వ తేదీ నాటికి టెండర్లు పూర్తయి మిగిలిన అన్ని పనులు ఏకకాలంలో వేగవంతం అవుతాయని తెలిపారు.

పట్టణం మరియు కాలనీ విస్తరణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో పైప్‌లైన్లు, కొళాయి కనెక్షన్ల కోసం ₹15 కోట్లు మంజూరు కాగా, అందులో ₹2.20 కోట్లు పెద్ద చెరువు సుందరీకరణకు, మిగిలిన నిధులను కొత్త పైప్‌లైన్లకు కేటాయించడం జరిగిందన్నారు.

పలమనేరు ప్రాంత శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ₹2,820 కోట్లతో సమగ్ర 'వాటర్ గ్రిడ్' పథకాన్ని తెచ్చారని, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ద్వారా శ్రీశైలం నుంచి గండికోట మీదుగా నీటిని తరలించి నిరంతర సరఫరా అందిస్తామని వివరించారు.

ప్రస్తుతం కౌండిన్య ప్రాజెక్ట్ బోర్లు ఎండిపోయినప్పుడు వచ్చే తాగునీటి ఎద్దడికి ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందన్నారు.

మురుగునీటి శుద్ధి కేంద్రం (STP - Sewage Treatment Plant)

పట్టణ మురుగునీరంతా పెద్ద చెరువు, బొమ్మిదొడ్డి చెరువులోకి చేరి కలుషితం కాకుండా నివారించడానికి ₹15 కోట్లతో ఎస్టీపీ (STP) మంజూరు చేశామని తద్వారా శుద్ధి చేసిన నీటిని దిగువ ప్రాంతాల్లోని రైతులు పంట పొలాల సాగుకు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని తెలిపారు. ఏదేమైనా పలమనేరు మున్సిపాలిటీ అన్ని విధాలా కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందనుందని ఆయన స్పష్టం చేశారు.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU