Naidupeta: నాయుడుపేటలో ప్రజా దర్బార్.. 55 అర్జీలపై ఎమ్మెల్యే విజయశ్రీ సమీక్ష
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ‘ప్రజా దర్బార్’జరిగింది.
Naidupeta: నాయుడుపేటలో ప్రజా దర్బార్.. 55 అర్జీలపై ఎమ్మెల్యే విజయశ్రీ సమీక్ష
నాయుడుపేట: తిరుపతిజిల్లా నాయుడుపేట ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటమే లక్ష్యంగా నాయుడుపేటలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రత్యేక అతిథిగా పాల్గొని, పట్టణ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక ఇబ్బందులను, వారి వ్యక్తిగత అభ్యర్థనలను ఆమె ఓపికగా విన్నారు.
ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపాలిటీకి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చిన మొత్తం 55 గ్రీవెన్స్‌లపై ఆమె సమీక్షించారు. వీటిలో మున్సిపల్ కమిషనర్ పరిధిలో 35, ఎమ్.ఆర్.ఓ పరిధిలో 18, సి.డి.పి.ఓ వద్ద 1, ఎలక్ట్రికల్ ఏ.ఈ వద్ద 1 చొప్పున ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఆప్యాయంగా పలకరించారు. "నేను మీ మధ్యలో ఉండే ఎమ్మెల్యేను. మీకు ఏ సమస్య ఉన్నా భయం లేకుండా నాతో పంచుకోండి. ప్రభుత్వం నుండి మీకు అందాల్సిన సంక్షేమ పథకాలు, సేవలు ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి అర్హుడికి అందేలా చూడటమే మా ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం. సమస్య ఏదైనా సరే, పరిష్కరించే బాధ్యత నాది," అని ఆమె భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల ప్రశంసలు
ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆమెకు ఏమీ తెలియదని గతంలో అనుకున్న వారికి తన పనితీరుతో సమాధానం చెబుతున్నారు. వైద్యురాలిగా ఉన్నప్పుడు కాకుండా, ఇప్పుడు ఎమ్మెల్యేగా పూర్తిస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలను తీరుస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. "ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, సమస్య ఏదైనా సరే వెంటనే పరిష్కరించే దిశగా ఆమె చూపుతున్న చొరవ అద్భుతం" అని సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న తీరు, ప్రజలతో ఆమె మమేకమైన విధానం అక్కడ ఉన్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించడమే కాకుండా, సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు అధిక సంఖ్యలో నాయుడుపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.




