Narayanavanam: నారాయణవనంలో తీరని విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. మిస్టరీగా మారిన ఆత్మహత్యలు!
Narayanavanam: నారాయణవనంలో ఘోర విషాదం. అత్తాకోడళ్ల అనుమానాస్పద మృతి.. ఆపై పుత్తూరులో తండ్రి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్య. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి కావడంతో స్థానికంగా కలకలం.
Narayanavanam: నారాయణవనంలో తీరని విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. మిస్టరీగా మారిన ఆత్మహత్యలు!
నారాయణవనం: నారాయణవనం మండల పరిధిలోని వెంకటకృష్ణపాలెం చాకలి వీధిలో నివాసం ఉంటున్న అత్తా–కోడళ్లు చంద్రకళ (65), హరిత (35) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మోహన్ అనే వ్యక్తి నారాయణవనంలో సిమెంట్ దుకాణం నిర్వహిస్తూ, తన భార్య హరిత, తల్లి చంద్రకళ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో అత్తా–కోడళ్లు విగతజీవులుగా కనిపించడంతో విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో మోహన్‌కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ప్రాథమిక విచారణలో మోహన్ తన కుమారుడు (9వ తరగతి), కుమార్తె (7వ తరగతి)తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మరింత విషాదకర మలుపు చోటుచేసుకుంది. ఆచూకీ లేని మోహన్( 45), అతని కుమారుడు కౌశిక్( 14), కుమార్తె హిమనీ (12)పుత్తూరు మండలంలోని వేపగుంట క్రాస్ వద్ద రాత్రి కాచిగూడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలవడం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెంకటకృష్ణపాలెంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.




