Annamayya: అన్నమయ్య జిల్లా రైతులకు అందుబాటులో ఎరువులు

Annamayya: అన్నమయ్య జిల్లాలో ఎరువుల కొరత లేదు. APAIMS 2.0 ద్వారా పారదర్శకంగా పంపిణీ. ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసిన జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ.

Srinivasulu, Madanapalle
Published on: 11 July 2026 4:53 PM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య జిల్లా రైతులకు అందుబాటులో ఎరువులు

అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్–2026 సీజన్‌లో జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ (DAP) ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన APAIMS 2.0 వెబ్ అప్లికేషన్ ద్వారా ఎరువుల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు.

జూన్ 8 నుంచి APAIMS 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభమైందని, ఇప్పటివరకు 16,056 మంది రైతులకు 1,389.24 మెట్రిక్ టన్నుల యూరియా, 172.6 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ప్రధాన సమస్యలు ఎదురుకాలేదని పేర్కొన్నారు.

ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ (e-Crop)లో నమోదు చేసుకుని ఉండాలని, ఖరీఫ్-2025 ఈ-క్రాప్ నమోదును ప్రాతిపదికగా తీసుకుని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వివరాలను ధృవీకరించిన అనంతరమే ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సులు, ఈ-క్రాప్‌లో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా మాత్రమే రైతులకు యూరియా, డీఏపీ అర్హత పరిమాణం నిర్ణయిస్తున్నామని, అర్హతకు మించి ఎరువులు ఇవ్వడం లేదని తెలిపారు.

దీనివల్ల ఎరువుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. పంట మార్పిడి, మ్యాపింగ్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైన రైతులు తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. జూన్ నెలలో నిర్వహించిన "రైతన్న మీకోసం" కార్యక్రమం ద్వారా రైతులకు ఈ విధానంపై విస్తృత అవగాహన కల్పించామని తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఆగస్టు 2026 వరకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మార్క్‌ఫెడ్ వద్ద కూడా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. APAIMS ద్వారా ఎరువులను ఇతర మార్గాలకు మళ్లించే అవకాశం లేదని, 100 శాతం పారదర్శకంగా అర్హులైన రైతులకే పంపిణీ జరుగుతోందని జేసీ తెలిపారు.

ఎంఆర్పీ (MRP) కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయించే ప్రైవేట్ డీలర్లపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎరువుల కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటల విస్తీర్ణానికి అనుగుణంగా రైతు భరోసా కేంద్రాలు, రిటైలర్ల ద్వారా సకాలంలో ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story