Sullurupeta: పెరిమిటిపాడులో నరకప్రాయంగా మారిన ప్రధాన రోడ్డు
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఇలుపురు పంచాయతీ పెరిమిటిపాడు గ్రామంలో రోడ్లు దయనీయంగా మారాయి.
Sullurupeta: పెరిమిటిపాడులో నరకప్రాయంగా మారిన ప్రధాన రోడ్డు
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలంలోని ఇలుపురు పంచాయతీ, పెరిమిటిపాడు గ్రామంలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఉన్న ప్రధాన రహదారిపై చిన్నపాటి వర్షం కురిసినా నీరు భారీగా నిల్వ ఉంటోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఊరిలోకి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో, ప్రతి నిత్యం వందలాది మంది ప్రజలు, వాహనదారులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు.
ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మార్గం నరకప్రాయంగా మారింది. రోడ్డుపై నిలిచిన నీటిలోంచి విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లడం ప్రాణ సంకటంగా మారింది. ఇలా నిలిచిన నీటిలో నడిచే క్రమంలో చిన్నారులు జారిపడి గాయాలపాలవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా, ఈ మురుగునీరు ఆలయ ఆవరణలోకి కూడా చేరుతుండటంతో పవిత్రమైన ప్రాంగణం అపవిత్రమవుతోందని భక్తులు అసహనానికి గురవుతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు స్థానిక పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా, ఏమాత్రం స్పందన లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. "నాకు ఎందుకు?" అన్నట్లుగా సెక్రటరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బాధ్యత గల పదవిలో ఉండి ప్రజల సమస్యల పట్ల ఇంతటి నిర్లక్ష్యం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమవుతుండటంతో, రోడ్డుపై నిలిచిన ఈ నీటి వల్ల దోమలు పెరిగి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తులు భయపడుతున్నారు.
నియోజకవర్గ అభివృద్ధిలో ఎప్పుడూ ముందుండి, ప్రజల సమస్యల పరిష్కారంలో తక్షణమే స్పందించే స్వభావం కలిగిన స్థానిక ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ గారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తొలగించి, యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు సమస్యను పరిష్కరించి, గ్రామస్తులకు, విద్యార్థులకు, భక్తులకు మేలు చేయాలని పెరిమిటిపాడు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నారు. తక్షణమే ఈ సమస్యపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.




