Kothagudem: చిరుత చర్మం 17 గోర్ల విక్రయానికి యత్నం నలుగురు నిందితుల అరెస్ట్

Kothagudem: చింతూరు అటవీ ప్రాంతంలో చిరుతను చంపి చర్మం, 17 గోర్లను విక్రయించేందుకు యత్నించిన నలుగురిని బూర్గంపాడు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 24 Aug 2026 2:34 PM IST
Kothagudem
X

Kothagudem: చిరుత చర్మం 17 గోర్ల విక్రయానికి యత్నం నలుగురు నిందితుల అరెస్ట్

Kothagudem: చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను బూర్గంపాడు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చిరుతపులి చర్మం, 17 గోర్లు, వాటిని తరలించేందుకు ఉపయోగించిన చిన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.

కొత్తగూడెంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు కేసు వివరాలను వెల్లడించారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు.

విశ్వసనీయ సమాచారంతో పట్టివేత

ఎస్పీ వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు బూర్గంపాడు ఎస్‌ఐ నాగబిక్షం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం తాళ్లగొమ్మూరు గ్రామంలోని అనిల్ కుమార్ ఇంటి వద్ద నిఘా ఏర్పాటు చేశారు. అక్కడ చిన్న బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో నిందితులు గత వేసవిలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో పడి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న చిరుతపులిని రాళ్లు, కర్రలతో కొట్టి, బాణాలతో దాడి చేసి చంపినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం చిరుత చర్మాన్ని తొలగించి ఎండబెట్టడంతో పాటు గోర్లను వేరు చేసి భద్రపరిచినట్లు విచారణలో వెల్లడైందన్నారు.

విక్రయానికి సహకరిస్తానని చెప్పడంతో

చిరుత చర్మం, గోర్లను విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు సారపాకకు చెందిన చల్లా అనిల్ కుమార్‌ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. కొనుగోలుదారులను సంప్రదించి విక్రయానికి సహకరిస్తానని అనిల్ కుమార్ చెప్పడంతో కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్య కలిసి గోర్లను చిన్న బ్యాగులో పెట్టుకుని తాళ్లగొమ్మూరులోని అనిల్ కుమార్ ఇంటికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

విక్రయానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుల వివరాలు

అరెస్టైన వారిలో చల్లా అనిల్ కుమార్ తాళ్లగొమ్మూరు గ్రామం, సారపాక, బూర్గంపాడు మండలానికి చెందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురు కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్య చింతూరు మండలం గమ్మలకోట గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

నిందితుల వద్ద నుంచి చిరుతపులి చర్మం, 17 గోర్లు, చిన్న బ్యాగు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ, అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

వన్యప్రాణులను వేటాడటం, చంపడం లేదా అక్రమంగా వాటి అవయవాలను విక్రయించేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. వన్యప్రాణులను చంపేందుకు విద్యుత్‌ తీగలు అమర్చడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story