Srikalahasthi: శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపాలపై విమర్శలు!
Srikalahasthi: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో పురుషుల మరుగుదొడ్డిలో మహిళా సిబ్బందితో శుభ్రత పనులు చేయించడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Srikalahasthi: శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపాలపై విమర్శలు!
Srikalahasthi: ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు మరోసారి విమర్శలకు దారితీసింది. ఆలయ పరిపాలన భవనం ఎదుట, త్రినేత్ర అతిధి గృహం సమీపంలోని పురుషుల మరుగుదొడ్డిలో మహిళా పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రత పనులు చేయిస్తున్న పరిస్థితి భక్తుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మహిళా సిబ్బంది మరుగుదొడ్డిని శుభ్రపరుస్తున్న సమయంలోనే పురుషులు అక్కడికి వెళ్లి మూత్ర విసర్జన చేయాల్సి రావడం పట్ల పలువురు ప్రశ్నిస్తున్నారు.
పర్యవేక్షకులు ఉన్నా పట్టింపు లేదా?
దేవస్థానంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకు సిబ్బంది, సూపర్వైజర్లు ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎలా ఏర్పడిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా సిబ్బంది పురుషుల మరుగుదొడ్డిలో పనిచేస్తున్న సమయంలో కనీసం కొద్దిసేపు పురుషుల ప్రవేశాన్ని నిలిపివేయడం, ప్రత్యామ్నాయ మరుగుదొడ్డిని చూపించడం లేదా పురుష సిబ్బందితో శుభ్రత పనులు చేయించడం వంటి సాధారణ చర్యలు కూడా చేపట్టకపోవడం అధికారుల పర్యవేక్షణ తీరుపై అనుమానాలకు తావిస్తోంది.
భక్తుల అసౌకర్యం పట్టదా?
దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులు నెలకొనడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. మహిళా పారిశుద్ధ్య సిబ్బంది గౌరవం, భద్రతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను సమన్వయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.
ఇకనైనా అధికారులు స్పందిస్తారా?
దేవస్థానంలో నిత్యం ఏదో ఒక అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, కనీస పారిశుద్ధ్య నిర్వహణలోనూ నిర్లక్ష్యం కనిపిస్తే బాధ్యత ఎవరిదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పురుషులు, మహిళల మరుగుదొడ్లలో శుభ్రత పనులకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించి, పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.




