Puttur: సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ.. పుత్తూరులో వైఎస్సార్సీపీ నిరసన
Puttur: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదంటూ కూటమి మేనిఫెస్టో కాపీలను దహనం చేసిన మాజీ చైర్మన్ గడ్డం హరి.
Puttur: సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ.. పుత్తూరులో వైఎస్సార్సీపీ నిరసన
Puttur: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం పుత్తూరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు టీడీపీ–జనసేన –బీజేపీ కూటమి మహిళలు, యువత, రైతులు, విద్యార్థులు, ప్రతి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు.
నెలకు రూ.4 వేల పింఛన్, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ప్రత్యేక మద్దతు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం వంటి పథకాలపై ప్రజలకు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నిరసనలో భాగంగా మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు, ఎన్నికల ప్రచార బాండ్ల ప్రతులను దహనం చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. హామీల అమలులో జాప్యం కొనసాగితే ప్రజా సమస్యలపై తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాలపై ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పుత్తూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంగి గడ్డం హరి, వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, వైఎస్ఆర్సిపి నాయకులు సీఎం దిలీప్, మునయ్య,చిరంజీవి,కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.




